వయసు పెరిగేకొద్దీ శరీర కూర్పులో మార్పులు వస్తాయి. కండర ద్రవ్యరాశి తగ్గడం, కొవ్వు పంపిణీలో మార్పులు వంటి కారణాలతో ఒకే బీఎంఐ ఉన్న ఇద్దరి ఆరోగ్య పరిస్థితులు ఒకేలా ఉండకపోవచ్చు. అందుకే పెద్దవారిలో బరువు, నడుము చుట్టుకొలత, శారీరక సామర్థ్యం, ఇతర అనారోగ్యాలు అన్నిటినీ కలిపి చూడాల్సిన అవసరం ఉందని పరిశోధన సూచిస్తున్నది. ఇక్కడ పరిశోధకులు పెద్దవారిలో అధిక కొవ్వును రెండు రకాలుగా చూశారు- ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు కనిపించని దశ, అలాగే అధిక కొవ్వుతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్న దశ. అంటే ఒకరి బరువు ఎక్కువగా ఉందనే కారణంతోనే వాళ్ల ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేయలేమన్నమాట. అలా అని, బీఎంఐని పూర్తిగా పక్కన పెట్టాలా? అంటే కాదు. అది ఇప్పటికీ ఉపయోగకరమైన ప్రాథమిక కొలమానమే. అయితే ముఖ్యంగా వయసు పెరిగిన వారిలో దానిని ఒక్కటే ప్రమాణంగా తీసుకోకూడదన్నదే ఈ పరిశోధనలోని ముఖ్యమైన సారాంశం.