లోగో.. చూసేందుకు చిన్నదే కావచ్చు. కానీ, అది ఓ సంస్థ ఉనికికి చిహ్నంగా మారుతుంది. ప్యాకింగ్ ఆకర్షణీయంగా ఉంటేనే, ఎంత నాణ్యమైన ఉత్పత్తి అయినా కొనబుద్ధేస్తుంది. ఈ విషయం తెలిసినవారికి ’బియాండ్ డిజైన్స్’ ప్రత్యేకత బాగా అర్థం అవుతుంది. ఈ సంస్థది బ్రాండ్ డిజైనింగ్‌లో అరుదైన ప్రయాణం. ‘బియాండ్ డిజైన్స్’ వ్యవస్థాపకురాలి పేరు భవిక షా. ముంబైలో పుట్టి పెరిగారు. తనకు మొదటినుంచీ సృజనాత్మకంగా పనిచేయడం ఇష్టం.
ఆ రంగం మీద పట్టు సాధించేందుకు గ్రాఫిక్ డిజైనింగ్‌లో డిగ్రీ చదివారు. అదే అంశం మీద మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత, ఏదో ఉద్యోగంలో స్థిరపడేందుకు ప్రయత్నించినా.. ఏ కొలువూ నచ్చలేదు. తనకంటూ ఓ సంస్థను నిర్మించుకోవడమే సరైన దారి అని మనసు బలంగా చెప్పింది. కూతురు ఇబ్బంది పడుతుందేమో అని తల్లిదండ్రులు సందేహించారు. కానీ నానమ్మ మాత్రం అండగా నిలబడి ఆర్థిక సాయం చేసింది. అలా మొదలైంది ‘బియాండ్ డిజైన్స్’. వ్యాపారంలో నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగా నీల్కమల్ ప్లాస్టిక్స్ తమ లోగోను డిజైన్ చేయమని అడిగింది. ఆ సృజన అందరికీ నచ్చడంతో భవిక పేరు కార్పొరేట్ ప్రపంచానికి పరిచయమైంది. ఇప్పటివరకూ ఆరొందల మంది క్లయింట్స్‌కు సేవలందించి, ఈ రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నారు భవిక. ‘బియాండ్ డిజైన్స్’లో అందరూ మహిళలే.