Ramdev Baba : ‘వందేమాతరం (Vandemataram)’ గీతం పూర్తి రూపంలో ఆలపించడంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో యోగాగురు (Yoga Guru) బాబా రాందేవ్ (Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ గీతంలోని సాహిత్యం హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి వంటి వారిని పూజించడం గురించి కాదని, కేవలం ‘భారతమాత (Bharat Maata)’ కు చేసే ఆరాధన అని ఆయన ఆదివారం స్పష్టంచేశారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని హరిద్వార్ (Haridwar) లో జరిగిన ఓ కార్యక్రమంలో రాందేవ్ మాట్లాడారు.
తాము భారతమాతనే దుర్గగా, లక్ష్మిగా భావిస్తామని, ఆమే మా విశ్వాసం, మా జ్ఞానం, మా ఆలయమని, వందేమాతరంలో దేవతలను, ఆలయాలను చూసేవారు మన సంస్కృతికి దూరమైన వారని, భారతమాత ఆరాధనను దేవతలతో ముడిపెట్టి ఒక మతానికి వ్యతిరేకమని చెప్పడం మేధో దివాళాకోరుతనమని రాందేవ్ బాబా అన్నారు. విద్యార్థుల నిరసనల గురించి ప్రస్తావిస్తూ, చిన్న పిల్లలను నిరసనల్లోకి లాగడాన్ని తప్పుబట్టారు. ఐదు పదేళ్ల పిల్లలను కూడా పోలీస్ స్టేషన్లను ముట్టడించాలని, ఎస్పీలు, డీఎంలను ఘెరావ్ చేయాలని ప్రోత్సహిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు.
అయితే 18 ఏళ్లు నిండిన వారు ఎక్కడ అన్యాయం జరిగినా తప్పక పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కుల దూషణలపైనా రాందేవ్ స్పందించారు. “షెడ్యూల్డ్ కులాలు లేదా తెగల వారిని అవమానించడం రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు, బ్రాహ్మణులను దూషించడం కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధమే” అని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని ఆయన ప్రశంసించారు. ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన సూచనపై రాందేవ్ స్పందిస్తూ.. “స్వామి రాందేవ్ ఎవరో, ఆయన సేవ ఏంటో ఈ దేశ ప్రజలకు తెలుసు. అందువల్ల, అలాంటి స్థాయి వ్యక్తుల గురించి నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవడం లేదు” అని అన్నారు.