భాగ్య, బాబు.. ఇద్దరూ హైస్కూల్ చదువు పూర్తి చేయలేదు. పొద్దునే లేస్తరు. ఇంటి పని చేసుకుంటరు. కొడుకు ఫోన్పట్టుకుంటే.. అందర్నీ నవ్వించే ముచ్చట పెడుతరు. ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టి, పిల్లలు బడికి.. బాబు హమాలీ పనికి, భాగ్య పొలం కైకిలికి పోతరు. అశ్లీలత లేకుండా మొగుడూపెళ్లాల సరదా ముచ్చట్లతో సాగిపోయే ‘భాగ్యవంతుడు బాబు’కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీరిద్దరికీ ఉన్నది ఒకటే ఫోన్! అయితేనేం? ‘అందరి సంతోషమే మా సంపద’ అంటున్న ఈ పేదింటి జంట అసలు ముచ్చట్లివి…
ఎడ్ల బాబు ఎనిమిదో తరగతి వరకు చదివాడు. భాగ్య పదోతరగతి చదివింది. వీళ్లది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని రూప్‌నారాయణపేట. బాబు పదహారు సంవత్సరాల వయసులోనే హమాలీ పని మొదలుపెట్టాడు. కూరగాయల మార్కెట్, పత్తి మార్కెట్లో పనిచేశాడు. ఎఫ్‌సీఐ గోదాముల్లో రెగ్యులర్ హమాలీకి బదులుగా పని చేయడానికి వెళ్లేవాడు. ‘ఆ రోజుల్లో నాకు సెల్‌ఫోన్ లేదు. నాతోని పనిచేసేటోళ్లకు సెల్ఫోన్లు ఉండేది. వాళ్లు దాంట్ల టిక్ టాక్ వీడియోలు చూసి సంబురపడేది. పిల్లల పుస్తకాలకు, బట్టలు, తిండికి సర్దడానికే సంపాదన సాల్తలే. ఏడేండ్ల కింద చిన్న పాత ఫోను కొన్న. అందుల వీడియోలు చూసుకుంట సంబురపడ్డ. అందరి వీడియోలు నేను సూసుడేంది? నేనే ముచ్చట్లు చెబితే బాగుంటది కదా అనిపించింది. ఒక వీడియో చేద్దమనుకున్న. టిక్‌టాక్‌ల ఒకమ్మాయి వీడియోలు చేసేది. ఆ అమ్మాయి ఇంకో అబ్బాయితో మాట్లాడేది. కానీ, ఆ అబ్బాయి కండ్లవడేది కాదు. వాళ్లేం మాట్లాడుతున్నరో నాకు తెల్వకపోయేది. ఆ వీడియోని తీస్కోని దానికి తెలుగు మాటలు చేర్చిన.. అట్ల అందరూ నవ్వుకునేట్టు ముచ్చట్లు చెప్పేది. టిక్‌టాక్‌ల నాకు తొమ్మిది వందల మంది ఫాలోవర్స్ అయినరు. అట్ల రెండు సంవత్సరాలు చేసిన’ అని టిక్‌టాక్ నవ్వుల గురించి బాబు గుర్తు చేసుకున్నాడు.
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తే ఆదాయం కూడా వస్తుందన్న విషయం ఎవరి ద్వారానో బాబుకు తెలిసింది. ఇంకేముంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తెలుగు బాబు పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేసిండు. వచ్చిన ఐడియా, నచ్చిన కాన్సెప్ట్‌తో చిన్న చిన్న వీడియోలు చేస్తూ జనాన్ని నవ్వించడం మొదలుపెట్టిండు. కొన్నాళ్లకు… ‘ఎప్పుడూ నేనొక్కడినేనా నువ్వు కూడా చేస్తే బాగుంటదని మా భాగ్యను చానాసార్లు బతిమాలిన. రా భాగ్య వీడియో చేద్దామని అడగంగ.. అడగంగ ఒప్పుకొన్నది. ఇద్దరం కలిసి ‘గోంగూర పచ్చడి – గోర్ల మైదాకు’ వీడియో చేసినం.
‘రోజుకు ఒక్కటే వీడియో చేస్తం. రేపు ఏ వీడియో చేయాలో రాత్రే రాసి పెట్టుకుంటం. పొద్దున ఇంటి పనులన్నీ చేసుకున్నంక వీడియో తీయడం మొదలువెడతం. నా కొడుకు వీడియో తీస్తడు. తర్వాత ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తం. రోజూ కైకిలి దొరకదు. కైకిలి లేని నాడు నూకలు తింటం. పురుగులు పడ్డ బియ్యం తిన్న రోజులున్నయ్. ఇయ్యాల పైసలస్తెనే వండుకుని తినేది అన్నట్లుంది ఇంట్ల. కాబట్టి వీడియో చేసినంక ఆయన హమాలి పనికివోతడు. మా అత్తమ్మతో కలిసి నేను కైకిలి పోత. నాట్లేస్తా, కలుపు తీస్తా, కోతలు కోస్తా, పత్తి తీస్తా, అన్ని పనులు చేసుకుంటనే వీడియోలు చేస్తా’ అని భాగ్య ఇంటి కష్టాలు చెప్పుకున్నది.
బాబు: ఓ ఉప్పు లేదు. కారం లేదు. సప్పగ… సతుకు అన్నం
భాగ్య: ఓ బిత్తిరోడా.. అది గోంగూర పచ్చడి కాదు. గోర్ల మైదాకు నూరి పెట్టుకున్న. గోంగూర ఆ పక్కనుంది. వేసుకుని తిను!.. ఇట్ల సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు బాబు.
ఈ వీడియోకి ఫేస్బుక్లో 30 లక్షల వ్యూస్ వచ్చాయి. చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్‌ని భాగ్యకు చూపించాడట బాబు. తర్వాత ఎంతో బతిమాలితే గానీ మరో వీడియోకు ఒప్పుకోలేదట ఆమె. ‘ఓ మేఘమా పట్నంలో వర్షం కురిస్తె.. ఏమొస్తది?. ఇండ్లల్లకి నీళ్ల్లొస్తయ్. పల్లెటూర్లల వర్షం పడితే పంటలు వండుతయ్. అక్కడికెందుకు పోతున్నవే మేఘమా? ఈ పల్లెటూళ్లల్ల కురువు..’ అని చేసిన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికొచ్చిన కామెంట్లు చూసి మళ్లీ సంబురపడ్డారు. ఇద్దరూ కలిసి ఇంకో వీడియో చేశారు. దానికి మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత మరొకటి చేశారు. దానికి రెండు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలా.. భాగ్య, బాబు సోషల్ మీడియా స్టార్లు అయిపోయారు.
‘మా భాగ్య మారిపోయింది. మొదాల బతిమిలాడంగ.. బతిమిలాడంగ వీడియో చేసెటందుకు ఒప్పుకొన్నది. కామెంట్లు చూసి.. ఇంకొక్క వీడియో ఉంటే తయారు చెయ్యి నేను కూడా చేస్త అనడిగింది. ఇగ ఉత్సాహం పెరిగింది. అప్పటి నుంచెల్లి ఆపకుంట వీడియోలు చేసుకుంట వచ్చినం. మా ఇంట్ల మాట్లాడుకుంటంటే జరిగినయి చేశినం. తెలిసిన జోక్స్ చేశినం. రోజుకో వీడియో చేస్తాంటే జోక్స్ అయిపోతాన్నయ్. చిన్నప్పుడు కూరగాయల మార్కెట్లో హమాలి పనికి చేరిన. తొమ్మిదేండ్లు ఆ పనిచేసిన. అక్కడికి తీరొక్క మనిషొస్తడు. ఆరేడు వందల మంది ఉంటరు. ఆ తొమ్మిదేండ్లలో ఎన్నో విశేషాలు విన్న. గుర్తున్నయన్నీ వీడియోలు చేసిన. కొన్ని సేకరించిన. ఊళ్లల్ల ఉండే కైతికాల మాటలతోని మస్త్ జోక్స్ చేసిన. మా అవ్వను అడిగితె.. ఎనకటి సాత్రాలు, జోకులు చెప్పింది. వాటిని కొంత మార్చి చెప్పినం’ అంటూ సోషల్ మీడియా జర్నీ గురించి పంచుకున్నాడు బాబు.
ఫేస్బుక్ : 195 వేలు
ఇన్స్టాగ్రామ్ : 191 వేలు
యూట్యూబ్ : 70 వేలు
వీడియోలు క్వాలిటీ ఉంటేనే ఆడియన్స్‌ని మెప్పిస్తాయి. జనాన్ని మెప్పించడం కోసం కొన్ని పాట్లు కూడా పడ్డారు. ‘డ్వాక్రా లోన్ తీసుకున్న. ముప్పై వేలు వస్తె.. అండ్ల ఇరవై వేలు అప్పు తీర్చిన. పది వేలతోని కొత్త ఫోన్ కొన్న. ఆ డబ్బా ఫోన్ పక్కన పడేశినం’ అని రీల్స్ కోసం చేసిన త్యాగాన్ని భాగ్య గుర్తుచేసింది. క్వాలిటీ వీడియోలు మేము తీస్తే.. రచ్చ రవి అన్న మంచి పేరు పెట్టిండని బాబు గుర్తు చేసుకున్నడు. ‘మా వీడియోలు చూసి జబర్దస్త్ రచ్చ రవి ఫోన్ చేసిండు. మీ వీడియోలు చూస్తాన్న. బాగున్నయ్. కానీ చానల్ పేరు బాగలే. తెలుగు బాబు పేరు మార్చమన్నడు. మంచి పేరు ఐడియా రావట్లేదంటే.. మీ ఆవిడ పేరేందని అడిగిండు. భాగ్యని చెప్పిన. మీ ఆవిడ పేరులోనే ఉంది నీ భాగ్యమని చెప్పి, ‘భాగ్యవంతుడు బాబు’ పెట్టుకోమన్నడు. ఈ పేరు బాగుందని మార్చుకున్నం.
‘మేం వీడియోలు తీస్తాంటే బాగామంది పేర్లు పెట్టిన్రు. పనీపాట లేదన్నరు. మేం తప్పు మాట్లాడ్తలేం, తప్పు చేస్తలేం. ఎవరి మాటలూ పట్టించుకోకుండ ముందుకు పోతున్నం. కొద్దిమంది సుట్టాలు మాకు సపోర్ట్‌గా ఉన్నరు. వాళ్లని పట్టించుకోవద్దని అన్నరు. అందరినీ నవ్వించడం కోసం పనిచేసినం’ అని గుర్తు చేసుకుంది భాగ్య. ‘ఈ వీడియోలకు కొద్దిగ పైసలొచ్చినయ్. కానీ, మాకు తెలియక చేసిన చిన్న చిన్న తప్పులకి చానల్‌కు స్ట్రయిక్ పడ్డది. కంపెనీల నుంచి వచ్చే మెసేజ్‌లు సదువ రాక, అర్థం కాక ఇబ్బందులు పడ్డం. పైసలు రానీ, రాకపోనీ ఇట్లనే అందర్నీ నవ్విస్తం. ఫాలోవర్స్ కామెంట్లే మాకు ఆస్తి. సంతోషంగ ఉన్నం’ అని బాబు ఇంతకాలం మోసిన భారాన్ని చెప్పుకొన్నాడు. లక్షలాది మంది సెల్‌ఫోన్ యూజర్సే వీళ్లకు అభిమానులు. కానీ, బాబుకి సెల్‌ఫోన్ లేదు. భాగ్య సెల్‌ఫోన్‌తోనే వీడియోలు చేస్తున్నారు. ఫోన్లేదని బాధపడడు బాబు! ‘సంతోషమే సగం బలం’ అంటారు. కానీ, వీళ్లకు పూర్తిగా అదే బలం!
– నాగవర్ధన్ రాయల