మీరు మీటింగ్‌లో ఉన్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వచ్చే కాల్స్‌ను మీ ఫోనే అటెండ్ చేయడం.. అలాగే, అవతలి వారు చెప్పేది నోట్ చేసుకోవడం చేస్తే ఎంత బాగుంటుంది? గూగుల్ పిక్సెల్ ఫోన్లలోని ‘టేక్ ఎ మెసేజ్’ ఫీచర్ ఇప్పటికే ఈ పని చేస్తున్నది. అయితే, ఇప్పటివరకు ఇది గూగుల్ అసిస్టెంట్ వాయిస్‌తో రోబోటిక్‌గా ఉండేది. కానీ తాజా ‘బీటా’ అప్డేట్ ప్రకారం.. ఇకపై మీ సొంత వాయిస్‌తో కస్టమ్ గ్రీటింగ్స్ సెట్ చేసుకునే వెసులుబాటు రాబోతున్నది.
సాధారణంగా ఎవరైనా కాల్ చేసినప్పుడు ఫోన్ ఎత్తకపోతే ‘వాయిస్ మెయిల్’కి వెళ్తుంది. కానీ గూగుల్ ‘టేక్ ఎ మెసేజ్’ ఫీచర్ ఏఐ సాయంతో ఆ కాల్ని లైవ్‌లో ఆన్సర్ చేస్తుంది. తాజా అప్డేట్లో ఏం చేయొచ్చు అంటే.. ‘హాయ్, నేను ప్రస్తుతం బిజీగా ఉన్నాను. మీ మెసేజ్ ఇక్కడ వదిలేయండి, నేను తర్వాత చూసుకుంటాను’ అని మీ వాయిస్‌తోనే రికార్డ్ చేసి ఉంచొచ్చు. అవతలి వ్యక్తి మాట్లాడే మాటలను ఏఐ టెక్ట్స్ రూపంలోకి మార్చి (Transcription) మీకు చూపిస్తుంది. Android Authority చెబుతున్న ప్రకారం.. గూగుల్ ఫోన్ యాప్ వెర్షన్ 160లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో పర్సనలైజ్డ్ ఎక్స్‌పీరియన్స్‌ని వినియోగదారులు పొందుతున్నారు. రోబో వాయిస్ కంటే మీ వాయిస్ వినడం వల్ల అవతలి వారికి మీరు అందుబాటులో లేరనే విషయం చాలా సహజంగా అర్థమవుతుంది. సో.. ఇకపై ఫోన్ ఎత్తలేని స్థితిలో ఉన్నప్పుడు కలిగే ఆందోళన తగ్గుతుంది.
మరోవైపు స్పామ్ ప్రొటెక్షన్ కూడా పెరుగుతుంది. గుర్తు తెలియని వ్యక్తులు లేదా టెలి మార్కెటింగ్ కాల్స్ వస్తే, ఏఐ వారిని ప్రశ్నించి అసలు విషయం తెలుసుకుంటుంది. అప్పుడు అనవసర కాల్స్ నుంచి మీకు విముక్తి లభిస్తుంది.
ఈ ఫీచర్‌ని వాడుకునే క్రమంలో ప్రైవసీ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాయిస్ క్లోనింగ్ రిస్క్ పొంచి ఉంది. వాయిస్ రికార్డింగ్ స్పష్టంగా ఉండాలి, లేకపోతే అవతలి వారికి అది అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది గూగుల్ పిక్సెల్ ఫోన్లలో కేవలం ‘బీటా’ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే పిక్సెల్ 9 సిరీస్, ఇతర లేటెస్ట్ పిక్సెల్ మోడల్స్‌లో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.