నగరాలు, పట్టణాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపెద్ద స్కూల్స్ అన్నీ శివార్లకు తరలుతున్నాయి. ఆయా పాఠశాలలకు వెళ్లే పిల్లలు.. ఇంటినుంచి నిత్యం 10 – 15 కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించాల్సి వస్తున్నది. దాంతో, వారి భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఉదయం వెళ్లింది మొదలు.. సాయంత్రం వచ్చేవరకూ వారి గురించే ఆలోచిస్తుంటారు. సమయానికి పిల్లలు ఇంటికి చేరకపోతే కంగారు పడిపోతుంటారు.
అలాంటివారి ఆందోళనను దూరం చేసేలా.. ‘Acumen Track GF-06’ పేరుతో జీపీఎస్ ట్రాకర్ తీసుకొచ్చింది ఆక్యుమెన్ సంస్థ. దీన్ని పిల్లల బ్యాగులో ఉంచితే చాలు. నిత్యం వారిని ట్రాక్ చేస్తూ ఉండొచ్చు. అందుకోసం తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. జీపీఎస్ లొకేటర్ ద్వారా.. పిల్లలు ఎక్కడున్నారో ఇట్టే గుర్తించొచ్చు.
ట్రెండీగా మెడలో ధరించే లాకెట్‌లా ఉంటుందీ ట్రాకర్. పిల్లలు కూడా తాము భద్రంగా లేమని అనుకున్నప్పుడు.. ఈ ట్రాకర్‌తో తల్లిదండ్రులను అలర్ట్ చేయొచ్చు. పిల్లలు దారితప్పినా, ఎవరైనా కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినా ఈ లాకెట్‌లోని బటన్‌ను క్లిక్ చేస్తే చాలు.. తల్లిదండ్రుల ఫోన్‌కు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. అలా.. బడిపిల్లల భద్రతకు భరోసా ఇస్తుందీ లాకెట్ ట్రాకర్!