ఒంటరిగా ఉంటే డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువట! అదీ ముఖ్యంగా మహిళల్లో. ఒంటరిగా ఉండటం అంటే ఏకాకి అని కాదు! మానసిక బాధలతో ఒంటరిగా ఉండేవాళ్లను పట్టుకునేందుకు షుగర్ కాచుకొని కూర్చుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే… ఒంటరితనం మన ఆరోగ్యాన్ని దెబ్బతీసి.. సైలెంట్‌గా డయాబెటిస్ రుగ్మతకు తలుపులు తెరుస్తుందట.
ఎవరితో కలవకుండా, కాస్త నిరాశలో ఉండే మహిళలకు డయాబెటిస్, హై బ్లడ్‌షుగర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, తలకు మించిన బాధ్యతలతో సతమతమయ్యే వారినీ షుగర్ పలకరిస్తుందట! నలుగురిలో కలవకుండా దూరం పాటించేవారికి చక్కెర రుగ్మత దగ్గరవుతుందట!!
కరోనా తర్వాత చాలామందిలో ఒంటరితనం పెరిగింది. ఇది మహిళలకు పెద్ద సవాలుగా మారుతున్నదని పరిశోధకులు గుర్తించారు. ‘మహిళలు చాలాసార్లు తమ సమస్యలను పంచుకోవడానికి వెనకాడతారు. ఇది వాళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డాక్టర్లు కూడా పేషెంట్లను చూసేటప్పుడు వాళ్ల ఒంటరితనం గురించి కచ్చితంగా అడగాలి’ అని పరిశోధకులు అంటున్నారు.
అందుకే.. మీరు ఇంట్లో ఎంత బిజీగా ఉన్నా సరే.. మీ ఫ్రెండ్స్, బంధువులు, పక్కింటి వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. వారానికి ఒకసారైనా అలా బయటికి వెళ్లండి. మీ మనసులో ఏదైనా ఉంటే బెస్టీలతో పంచుకోండి. వ్యాయామం చేయండి. చిన్నచిన్న పనులతోనైనా బయటి ప్రపంచంతో కనెక్ట్ అవ్వండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒంటరి భావనను దూరం చేస్తుంది.