డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డిజిటల్ చెల్లింపులు పెరిగిపోవడంతో ఒకప్పటి కంటే ఈ నియమం అవసరం ఇప్పుడే ఎక్కువ. ఈ దిశగా మన రోజువారీ ఆర్థిక అలవాట్లను క్రమబద్ధం చేసుకోవడానికి ‘కాకేబో’ గొప్పగా ఉపయోగపడుతుంది.
కాకేబోలో మన ఖర్చుల వివరాలు చేత్తో రాసుకుంటాం. కాబట్టి, ఖర్చు విషయంలో మనకు భావోద్వేగ సంబంధం ఉంటుంది. డబ్బును జాగ్రత్త చేసుకోవడానికి దారిచూపుతుంది.
కాకేబో ఆర్థిక పరిశీలనను ప్రోత్సహిస్తుంది. ఏదైనా కొనాలనుకునే ముందు మీ ఆర్థిక లక్ష్యాలకు ఆ వస్తువు అవసరమో లేదో చూసుకోమని హెచ్చరిస్తుంది. ఈ రకమైన అవగాహన కాలక్రమంలో మనల్ని అవసరాల మేరకే ఖర్చు చేసేలా తయారుచేస్తుంది.
ఖర్చు చేయడానికి ముందు పొదుపు ఆవశ్యకత గురించి కాకేబో నొక్కిచెబుతుంది. ఖర్చులు అన్నీ పోగా మిగిలింది పొదుపు చేయడానికి బదులుగా, ముందే పొదుపు చేయడం మనకు ఆర్థిక భద్రత ఇస్తుంది.
ఎన్నో పరిమితులతో కూడిన ఇతర బడ్జెటింగ్ పద్ధతులతో పోలిస్తే కాకేబో సరళంగా ఉంటుంది. పెద్దపెద్ద ఖాతాలు రాసుకునే బాధ ఇందులో ఉండదు. ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉంటాం కాబట్టి, ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. దీర్ఘకాలిక ఆర్థిక సుస్థిరతకు హామీ లభిస్తుంది.
జపాన్ పదమైన ‘కాకేబో’ అంటే ‘ఇంటి ఆర్థిక పద్దు’ అని అర్థం. దీన్ని 1904లో హనీ మొటోకో అనే జర్నలిస్ట్ పరిచయం చేశారు. ఆమె జపాన్ దేశపు తొలి మహిళా పాత్రికేయురాలు కూడా! ఈ విధానంలో మన ఆదాయ, వ్యయాల వివరాలు ఓ కాగితంపై చేత్తో రాసుకోవాలి. అలా మనకు వచ్చే రూపాయి, మన జేబులోంచి వెళ్లిపోయే రూపాయిపై మంచి అవగాహన కలుగుతుంది. దీనికోసం మన ఆదాయ, వ్యయ వివరాలను నాలుగు రకాలుగా ప్రశ్నించుకోవాలి.
1. మన దగ్గర ఎంత డబ్బు ఉంది?
2. పొదుపు ఎంత చేయబోతున్నాం?
3. ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నాం?
4. ఆర్థికంగా ఎలా మెరుగుపడతాం?
ఈ విధంగా మనం ఖర్చు చేసే విధానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. దీంతో మన ఆర్థిక నిర్ణయాలపై నిరంతరం అవగాహన ఉంటుంది. అనవసరంగా ఖర్చు చేసే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది.