ఫోన్, ట్యాబ్, ల్యాపీ.. గ్యాడ్జెట్ ఏదైనా ఆన్లైన్ వేదికగా వాడేస్తున్నాం. అందుకు యాప్, వెబ్సైట్, సాఫ్ట్వేర్.. ఇలా పలు రకాల మాధ్యమాలు ఉన్నాయి. వాటిలో రిజిస్టర్ అవడం.. యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావడం.. పనులు చక్కబెట్టుకోవడం క్షణాల్లో అయిపోతున్నది. అంతా బాగానే ఉంది! కానీ.. మీకు, మీరు వాడే మాధ్యమానికి మధ్య ఓ ముఖ్యమైన ఒప్పందం జరిగిందనే విషయం తెలుసా? అదే ఆన్లైన్ కన్సెంట్ (Online Consent). ఏమరుపాటుగా చేసుకునే ఒప్పందాలు ఎక్కడికి దారితీస్తాయో అని ఒక్కసారైనా ఆలోచించారా?
మీరు మీ వ్యక్తిగత డేటాని ఆయా మాధ్యమాలు యాక్సెస్ చేసేలా మీకు మీరుగా సమ్మతించడమే ఆన్లైన్ కన్సెంట్. మీరు గమనించారో లేదో.. ఏదైనా యాప్‌ని ఇన్స్టాల్ చేసి వాడుకునే క్రమంలో అది మీ కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, ఫోన్ గ్యాలరీ.. ఇలా పలు డేటా స్థావరాల యాక్సెస్ కోరుతుంది. మీరు ఎలోవ్ చేస్తేనే సంబంధిత యాప్ వాటిని యాక్సెస్ చేయగలదు. అంటే.. ఒక్కసారి మీరు ఎలోవ్ చేశాక దాని పని అది చేసుకుపోతుందన్నమాట. ఇంకేం చేస్తాం.. ‘అంగీకరించాం కదా!’ అని నిట్టూర్చకుండా.. ఎప్పటికప్పుడు ఆన్లైన్ ఒప్పందాన్ని రివ్యూ చేసుకోవాలి. మన హక్కుల్ని తెలుసుకోవాలి. ఆన్లైన్ ప్రపంచంలో ఆచితూచి ముందుకు సాగాలి. అందుకోసం మీ ‘ఆన్లైన్ కన్సెంట్’ ఎంత ముఖ్యమో తెలుసుకోవడం అవసరం.
జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్) లాంటి చట్టాల ప్రకారమే ఈ ఆన్లైన్ కన్సెంట్ జరుగుతుంది. వెబ్ సర్వీస్, యాప్ ఏదైనా యూజర్ డేటాని యాక్సెస్ చేయడానికి ముందే అన్ని వివరాల్ని క్షుణ్ణంగా తెలియజేయాలి. సేకరించిన డేటాని దేనికి వాడతారు? ఎక్కడ భద్రపరుస్తారు? ప్రైవసీని ఎలా కాపాడతారు?.. లాంటి వివరాల్ని విధిగా యూజర్ తెలుసుకునే హక్కు ఉంది. సైబర్ చట్టాలు, అవి కల్పించే హక్కుల్ని ప్రతి నెటిజన్ తెలుసుకున్నప్పుడే నెట్టింట్లో భద్రంగా మనగలుగుతాడు. లేకపోతే.. సోషల్ మీడియా, క్లౌడ్ స్టోరేజుల్లో ఏండ్ల తరబడి భద్రం చేసుకున్న వ్యక్తిగత వివరాలు ఏదో ఒక రోజు మిమ్మల్ని వీధిన పడేస్తాయని మర్చిపోవద్దు. పర్మిషన్స్ ఇచ్చే ముందు ప్రైవసీ ఒప్పందాన్ని నిశితంగా పరిశీలించడం తప్పనిసరి.
‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అన్నట్టుగానే వెబ్ సర్వీసులు, యాప్‌లు ఈ ‘ఆన్లైన్ కన్సెంట్’ చేసుకునే క్రమంలో వాటి పని అవి చేసుకుంటూ సంక్లిష్టంగా మార్చేస్తున్నాయి. చాలా పొడవైన షరతుల్ని ఏం అర్థం కాకుండా ఓ డాక్యుమెంట్లా పెడుతుంటాయి. కొన్ని అయితే.. షరతుల్ని ముందే టిక్ (Pre-Ticked Boxes) చేసేస్తున్నాయి. అంటే.. మనం చదివి టిక్ చేయాలనే ఆలోచన రాకుండానే ప్రాసెస్ కొనసాగించే ప్రయత్నం చేయడమన్నమాట. ఇంకొన్నయితే.. మన సమ్మతి రాగానే విచ్చలవిడిగా వ్యక్తిగత వివరాల్ని థర్డ్ పార్టీ సర్వీసులకు అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నాయి. మన ఊహకు అందని రీతిలో అవి మన డేటాని వాడేస్తుంటాయనేది కాదనలేని నిజం.
యాప్, వెబ్సైట్ దేనికైనా పర్మిషన్ ఇచ్చే ముందు అన్నిటినీ నిశితంగా చదవాలి. వేటికి అనుమతులు కోరుతున్నారు.. వాటి అవసరం ఏంటి? సేకరించిన డేటా విషయంలో తీసుకునే ప్రైవసీ పాలసీ ఏంటి?.. వీటన్నిటిపై ఓ క్లారిటీ వచ్చాకే యాక్సెప్ట్ చేయాలి. అలాగే, ఎప్పటికప్పుడు ‘కన్సెంట్ ప్రిఫరెన్స్’ను మారుస్తూ ఉండాలి. ఉదాహరణకు.. గూగుల్‌కి సంబంధించిన పర్మిషన్స్‌ని https://myactivity.google.comలోకి వెళ్లి రివ్యూ చేయొచ్చు. అక్కడ కనిపించే వాటిలో దేన్నయినా.. ఎప్పుడైనా మీ ప్రైవసీకి తగ్గట్టుగా మార్పులు చేసుకోవచ్చు. అంతేకాదు.. పలు రకాలు ‘ప్రైవైసీ టూల్స్’ వాడొచ్చు.
మన సమ్మతితో.. ఆన్లైన్ సర్వీసులు, మనం పనిచేసే సంస్థలు మనపై నిఘా వ్యవస్థల్లా పనిచేస్తాయి. అందుకే.. మన అవసరం మేరకు రివ్యూ చేసుకుని తగిన వాటికి అనుమతి ఇవ్వాలి. అది ఆన్లైన్ సర్వీసు కావచ్చు, ఆఫ్‌లైన్ సేవలు అయ్యుండొచ్చు. మన నుంచి వేలం వెర్రిగా డేటాను సేకరిస్తున్నారన్న అనుమానం వస్తే అడ్డుకోవడం మన ప్రాథమిక హక్కుగా భావించాలి. బయట ప్రపంచంలో ‘నో’ చెప్పడానికి ఎలా సంకోచించమో.. ఆన్‌లైన్‌లోనూ అలాగే మన ప్రైవసీని కాపాడుకునేందుకు ఎలాంటి ‘యాక్సెస్’కి అయినా ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి.. ఎంత అత్యాధునిక టెక్నాలజీ అయినా మనల్ని నియంత్రిస్తూ, నియమనిబంధనలకు అవరోధంగా మారితే.. ఆగి రీప్రోగ్రామింగ్ చేయడం మనందరి బాధ్యత! సో.. ఇకపై ఆన్లైన్ కన్సెంట్ యాక్సెప్ట్ చేసేముందు.. ఆలోచించండి గురూ!
భారతీయ చట్టం ప్రకారం పిల్లలకు 18 ఏండ్లు నిండితేనే మేజర్లుగా పరిగణిస్తారు. సైబర్ చట్టాలూ అంతే! ఆన్లైన్లో విహరించే పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచడం తప్పనిసరి. వాళ్లు ఎలాంటి వెబ్సైట్లు చూస్తున్నారో, ఏయే యాప్‌లు వినియోగిస్తున్నారో తెలుసుకోవాలి. నెట్టింట్లో పిల్లల ప్రైవసీ, హక్కులపై సైబర్ చట్టాలు ఏం చెబుతున్నాయో వారికి తెలియజేయాలి. పర్సనల్ ప్రైవసీ, ఇన్స్టిట్యూషనల్ ప్రైవసీ, కమర్షియల్ ప్రైవసీ మధ్య ఉన్న తేడాలను వివరించాలి. ఆన్లైన్లో పిల్లలు ఇస్తున్న డేటాను ఆయా సంస్థలు ఎలా మేనేజ్ చేస్తాయో వారికి తెలియజెప్పాలి. తమ తమ వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగదారుల సమాచారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారో విశదీకరించాలి. తమ ప్రైవసీని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో.. ఆన్లైన్ ఎథిక్స్ పాటించడం కూడా అంతే అవసరమని పిల్లలతో తరచూ చెబుతుండాలి. అప్పుడే వాళ్లు డిజిటల్ వెల్బీయింగ్గా మనగలుగుతారు.
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్