గుండుతో ఉన్న ఆడపిల్లల ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ‘బాల్డ్ బ్యూటీ’ పేరిట నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ ఫొటోలు బోల్డ్ బ్యూటీల చిత్రాలకు మించి లైక్‌లు అందుకుంటున్నాయి. అసలు వీళ్లంతా ఎవరు… ఎందుకిలా గుండుతో కనిపిస్తున్నారన్నది తప్పకుండా కుతూహలాన్ని కలిగించే అంశమే. కాస్త లోతులకు వెళ్తే వీళ్లంతా తమలాంటి తోటి మనుషులకు మానసికంగా దన్ను ఇచ్చే పనిచేస్తున్నారని అర్థం అవుతుంది. క్యాన్సర్‌తో పోరాడుతూ జుట్టును పోగొట్టుకున్న ఆడవాళ్లకు ఆత్మైస్థెర్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. వేల ముఖాల్లో చిరునవ్వులు తీసుకొచ్చేలా వీళ్లందరినీ ఒక్క తాటి మీదకు తీసుకొస్తున్న ఆ సోషల్ మీడియా వేదికల వెనకున్న వ్యక్తుల గురించి తెలుసుకోవడం ఈ ఫొటోలకు మించి ఆసక్తికర అంశం.
జుట్టు మనిషి ఉనికిలో భాగం. అందానికి అలంకారం. కానీ క్యాన్సర్‌లాంటి అతిపెద్ద ఆపదలు వచ్చిన వాళ్లకు అనుకోని పరిస్థితుల్లో జుట్టంతా రాలిపోతుంది. రూపురేఖలు వికారంగా తోస్తాయి. అలాంటి మహిళల కోసం తమ జుట్టును ఇచ్చి మానవత్వపు మొక్కు చెల్లించుకుంటున్నారు మనసున్న మనుషులు. @baldbeautyindia, @hyderabadhairdonation99 ట్విటర్ హ్యాండిల్స్‌లో ఈ తాలూకు చిత్రాలను మనం పెద్దసంఖ్యలో చూడొచ్చు. తోటివాళ్ల కష్టాన్ని పోగొట్టాలన్న తపనకు మించిన అందం మరోటి లేదంటూ ఇవి జనంలో అవగాహనను పెంపొందిస్తున్నాయి. ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందేలా దాతల చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుతున్నాయి. ఫలితం అద్భుతం. గుండు కూడా అందమే అనేంతగా వెంట్రుకలు దానమిచ్చేవారి ఆలోచనా విధానం మారిపోయింది. ఇలాంటి విలువైన
ఆలోచన, ఆచరణల వెనకున్న సంగతులు వాళ్ల మాటల్లోనే…
‘అందం ఆత్మవిశ్వాసాన్నిచ్చే అంశం’. ‘అందం అనేది అచ్చంగా మనసుకు సంబంధించిన అంశం’… నిజానికి ఈ రెండూ నిజమైనవే. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు కోణాలకూ మధ్య మేం వారధిగా పనిచేస్తున్నాం. సాధారణంగా అందంగా కనిపించినప్పుడు ఆడవాళ్లు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ, క్యాన్సర్‌లాంటి రోగాల చికిత్సలో భాగంగా కీమోథెరపీ తీసుకున్నప్పుడు వాళ్ల జుట్టు మొత్తం రాలిపోతుంది. దాంతో తమను తాము అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడతారు. ఇలాంటి వాళ్లకు ఆత్మైస్థెర్యాన్ని ఇచ్చి, వాళ్లను సాధారణ వ్యక్తులలాగే కనిపించేలా చేసేందుకు మేం జుట్టును దానంగా అడుగుతుంటాం.
అది కూడా మెడదాకా కత్తిరించుకోవడం కాకుండా గుండు చేయించుకుని జుట్టు ఇవ్వగలరా… అంటే మొత్తం జుట్టూ ఇవ్వగలరా అని అడుగుతున్నాం. చిన్నాపెద్దా అని తేడా లేకుండా చాలామంది ముందుకొస్తున్నారు. ఇలా వెంట్రుకలు ఇవ్వడం అంటే కేవలం సాయపడటమే కాదు, గుండుతో కనిపించడం సాధారణమైన విషయంగానే తీసుకోవాలన్న సందేశం కూడా దాగి ఉంటుంది. 2020లో బాల్డ్ బ్యూటీ ఇండియా ఇన్‌స్టా హ్యాండిల్‌ను ప్రారంభించడం వెనుక ఉన్న ఉద్దేశం అదే. భారతదేశ వ్యాప్తంగా ఉన్న దాతల నుంచి మేం జుట్టును సేకరించి, విగ్‌లు తయారు చేయడానికి పంపుతాం. ఇందుకోసం ఆయా రాష్ర్టాల్లో మాలాంటి ఉద్దేశాలు కలిగిన సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. మేం నేరుగా కూడా 500 మందికిపైగా దాతల నుంచి వెంట్రులను సేకరించాం.
తృపాల్ పటేల్, బాల్డ్ బ్యూటీ ఇండియా స్థాపకులు
‘నేను ఒక హెయిర్ ైస్టెలిస్ట్ని. మొదట్లో లాక్మీ, జావేద్హబీబ్ లాంటి సంస్థల్లో పనిచేశాను. హెయిర్‌కట్ చేసేప్పుడు ఎంతో జుట్టు వృథాగా పోయేది. అయితే దాన్ని ఏదైనా ఒక మంచి విషయం కోసం ఉపయోగిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది. అలా, 2019లో ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించా. ఫేస్బుక్, టిక్‌టాక్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నా ఆలోచనను నలుగురితో పంచుకున్నా. నా దగ్గర హెయిర్‌కట్‌కి వచ్చిన కస్టమర్లకూ వెంట్రుకల దానం గురించి చెప్పా. తొలుత జుట్టును సేకరించి ముంబయిలోని ఓ సంస్థకు పంపేవాళ్లం.
వాళ్లే విగ్‌లు కుట్టి పంచేవారు. కొవిడ్ సమయంలో మన తెలుగమ్మాయికి విగ్ అడిగినప్పుడు దొరకకపోవడంతో, అసలు మనమే ఆ పని కూడా చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చింది. చాలా కష్టపడి ఇక్కడే విగ్‌లు తయారు చేసే ఓ సంస్థను సంప్రదించి తొలి విగ్ చేయించి ఆ పాపకు ఇచ్చాం. ఇక, తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఒక్క మా ఫౌండేషన్ ద్వారానే 2 వేల హెయిర్ డొనేషన్లు తీసుకున్నాం. అవి కాక బాల్డ్బ్యూటీలాంటి సంస్థల నుంచి వచ్చిన వెంట్రుకలనూ సేకరించి విగ్గులను తయారు చేస్తున్నాం. ఈ నాలుగేండ్లలో 1,000 మంది పేద రోగులకు ఉచితంగా విగ్గులు అందించాం.
3 ఏండ్ల పాప నుంచి 70 ఏండ్ల పెద్దవాళ్ల దాకా మాకు దానం ఇచ్చిన వాళ్లలో ఉన్నారు. క్యాన్సర్‌తో చనిపోయిన ఒకాయనకు కూతురే అంత్యక్రియలు చేసింది. అంత్యక్రియల కోసం ఆమె గుండు చేయించుకున్నప్పుడు మా ఫౌండేషన్‌కే దానం ఇచ్చింది. కొందరు దేవుడి మొక్కులు ఉన్న వాళ్లు కూడా మా దగ్గర గుండు చేయించుకుని దానం చేస్తున్నారు. నిజానికి మానవత్వానికి మించిన మంచి పని ఇంకేం ఉంటుంది చెప్పండి. మాది ఒకప్పుడు దిగువ మధ్య తరగతి కుటుంబం. పేదరికం నుంచి వచ్చిన నేను కాస్త సౌకర్యవంతమైన జీవితాన్ని అందుకునే దాకా ఎదిగాక… పేదవారికి ఏదైనా చేయాలన్న ఆలోచన కలిగింది. ప్రస్తుతం జుట్టు సేకరించడం, విగ్‌లు కుట్టించడం, పంచడం లాంటి పనులకు అయ్యే ఖర్చంతా నా చేతి నుంచే భరిస్తున్నా. హీరో రవితేజ గారి ఉస్తాద్ షోకి వెళ్లినప్పుడు వచ్చిన డబ్బు కూడా ఈ పనికి కొంత సాయమైంది.
ఇక మా పేజీ ‘హైదరాబాద్ హెయిర్ డొనేషన్ 99’ద్వారా ఎవరైనా జుట్టు దానమిచ్చేందుకు ముందుకు రావచ్చు. 96664 06586 నంబరును సంప్రదించవచ్చు. అలాగే పేదలు ఎవరైనా ఉచితంగా విగ్ పొందడానికి కూడా ఈ నంబరుకు కాల్ చేయొచ్చు. కనీసం పన్నెండు అంగుళాల పొడవైన జుట్టు ఉన్నవాళ్లు దానం చేయొచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన పెరిగింది. జుట్టు దానం ఇవ్వడానికి చాలామంది ముందుకొస్తున్నారు. అది సంతోషకరమే అయినా, దానికన్నా ఎక్కువ సంఖ్యలో విగ్‌లు కావాలని అభ్యర్థనలు ఉన్నాయి. అంటే ఈ నాలుగేండ్లలో కేసుల సంఖ్య బాగా పెరిగింది. వయసును బట్టి ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం వల్ల జీవితాలను కాపాడుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవి ఉచితమే!
శివ, హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ ఫేషెంట్స్ సంస్థ స్థాపకులు
– లక్ష్మీహరిత ఇంద్రగంటి