మనిషిని మిగతా జీవుల నుంచి వేరు చేసింది… నిటారైన వెన్నెముకే! పొత్తికడుపు నుంచి మెదడు వరకు.. శరీరాన్ని నిలిపి ఉంచే ఆసరా మాత్రమే కాదు, నాడీ వ్యవస్థకు రక్షణ కవచం, మన బరువును మోసే మహాదండం వెన్ను. మనం చేసే పొరపాట్లు వెన్నును విరిచేసే ప్రమాదం ఉంది. సయాటికా, ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి తీవ్ర సమస్యలకు దారితీసే ఆస్కారమూ ఉంది.
శరీర భంగిమ
నడక నుంచి నిద్ర వరకు ప్రతి సందర్భంలో మన శరీర భంగిమ సరిగా లేకపోతే… తీవ్రమైన వెన్నునొప్పికి దారి
తీయవచ్చు. వెన్నును నిటారుగా ఉంచగలిగితే ఈ సమస్య ఉండదు.
ఫోన్ స్క్రీన్
ఇదొక ఊహించని పొరపాటు. మొబైల్ ఫోన్ చూసేప్పుడు సహజంగానే కిందికి వంగి మెడను స్క్రీన్లో ముంచేస్తాం. దీనవల్ల వెన్నెముకలోని డిస్కుల మధ్య రాపిడి పెరిగే ప్రమాదం ఉంది. స్క్రీన్ టైమ్ తగ్గించడం.. చూసిన కొద్దిసేపు కూడా
నిటారుగా చూడటం దీనికి పరిష్కారం.
హైహీల్స్
మన వెన్నెముక సహజమైన ఒంపుతో ఉంటుంది. హై హీల్స్ ధరించడం వల్ల, వెన్ను ఆకృతి మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫ్లాట్ సోల్ ఉన్న చెప్పులతో కూడా ఎత్తుగా కనిపించవచ్చు.
ధూమపానం
పొగాకులోని నికోటిన్ వెన్నుకు వెళ్లే రక్త ప్రసారాన్ని ప్రభావితం చేస్తుంది. దానివల్ల వెన్నెముక మధ్యలో ఉండే డిస్కులు పొడిబారిపోయి త్వరగా దెబ్బ తింటాయి. ధూమపానానికి దూరంగా ఉండటమే ఉత్తమ పరిష్కారం.
బరువులెత్తడం
పెద్ద బరువులు మోసేప్పుడు .. వెన్నుతో పాటు భుజాలు, చేతులు, కాళ్ల మీద భారం పడేలా చూడాలి. చిన్నపాటి ల్యాప్టాప్ బ్యాగులను సైతం ఒకే వైపు మోస్తే వెన్ను బలహీనపడవచ్చు.
డెస్కు ముందు
కంప్యూటర్ వచ్చిన తర్వాత ఎర్గొనామిక్స్ అనే శాస్త్రం బాగా ప్రచారంలోకి వచ్చింది. రోజులో మూడొంతులు కూర్చుని పనిచేసేటప్పుడు, మన కుర్చీ ఎలా ఉండాలి, బల్ల ఎంత ఎత్తులో ఉండాలి, భంగిమ ఎలా ఉండాలి అనే విషయాలను
కచ్చితంగా గమనించుకోవాలి.
..వీటితో పాటు విటమిన్-డి లోపించడం, కొన్ని రకాల మందుల ప్రభావం, దీర్ఘకాలం పాటు సైకిల్ ప్రయాణం.. వెన్నెముక అనారోగ్యానికి దారితీస్తాయి. ఇదేమీ ఒక్కరోజులో జరిగేది కాదు. మనం చేస్తున్న పొరపాట్లను తప్పక గమనించుకోవాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి.