ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఆసుస్.. తాజాగా డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. రెండు మానిటర్లపై పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం.. ‘ఆసుస్ జెన్‌బుక్ డ్యుయో’ పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ట్విన్ టచ్స్క్రీన్స్తో వస్తున్న ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్ ఇదేనన్నది ‘ఆసుస్’ మాట. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లతోపాటు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, పీసీఐ 4.0 ఎస్ఎస్డీ కార్డ్ లాంటి అత్యాధునిక ఫీచర్లను ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేస్తుంది. 75 వాట్స్ బ్యాటరీ, బ్లూటూత్ డిటాచబుల్ కీబోర్డ్, బిల్ట్ ఇన్ కిక్‌స్టాండ్ లాంటి అనేక ఫీచర్లతో వచ్చిన ‘ఆసుస్ జెన్‌బుక్ డ్యుయో’ ఖరీదు ప్రాసెసర్ మోడల్‌ను బట్టి.. రూ. 1,60,000తో ప్రారంభం అవుతున్నది. in.store.asus.com లో కొనుగోలు చేయొచ్చు.

చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’.. మార్కెట్లో కొత్త పంథాను అవలంబిస్తున్నది. ఓవైపు అధునాతన ఫీచర్లతో ప్రీమియం ఫోన్లు విడుదల చేస్తూనే.. బడ్జెట్ ఫోన్లకూ ప్రాధాన్యం ఇస్తున్నది. తన ప్రీమియం మోడల్స్‌కు అనుబంధంగా ‘లైట్’ ఎడిషన్లనూ తీసుకొస్తున్నది. తక్కువ ధరలోనే మంచిమంచి ఫీచర్లను అందిస్తున్నది. తాజాగా.. ‘నార్డ్ సీఈ4 లైట్ 5జీ’ పేరుతో మరో ‘లైట్’ ఫోన్‌ను వినియోగదారుల ముందుంచింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్3 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీని ఏర్పాటుచేశారు. ప్యూర్ ఆక్సిజన్ ఓఎస్ 14.0.. యూజర్లకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. 50 ఎంపీ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్స్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్‌లాంటి ఫీచర్లతో వస్తున్న వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ (5జీ) ధర.. రూ. 19,999. oneplus.inలో లభిస్తుంది.

దట్టమైన అడవులు, ఎత్తయిన పర్వతాలపై ట్రెక్కింగ్ చేసే సాహసికుల కోసం గార్మిన్ సంస్థ.. ఎట్రెక్స్ ఎస్ఈ పేరుతో సరికొత్త ‘నేవిగేటర్’ను తయారుచేసింది. ఇది ఒక్క జీపీఎస్‌ను మాత్రమే కాకుండా.. గెలీలియో, గ్లోనాస్లాంటి అన్ని రకాల గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్‌ను యాక్సెస్ చేయగలుగుతుంది. ఈ పరికరాన్ని ‘గార్మిన్ ఎక్స్ప్లోర్ యాప్’తో కనెక్ట్ చేయడం ద్వారా.. తాజా వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది. ‘డిజిటల్ కంపాస్’గానూ పనిచేస్తూ.. మీకు దిశానిర్దేశం చేస్తుంది. దీనిలోని మరో అద్భుతమైన ఫీచర్.. బ్యాటరీ లైఫ్. ఒక్కసారి చార్జ్ చేస్తే.. 168 గంటల వరకూ నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటుంది. ఎక్స్‌పెడిషన్ మోడ్‌లో ఏఏ బ్యాటరీలను ఉపయోగిస్తే.. 1800 గంటల వరకూ రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. హైకాంట్రాస్ట్ 2.2 అంగుళాల డిస్ప్లేతో వస్తున్న ఈ ఎట్రెక్స్ ఎస్ఈ ధర.. రూ. 16,000. garmin.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ వినియోగదారులకు ఎదురయ్యే ప్రధాన సమస్య.. చార్జింగ్! ఫోన్లో చార్జింగ్ అయిపోయిందంటే.. యూఎస్బీ లైటెనింగ్ కేబుల్స్ ఎక్కడో కానీ దొరకవు. ఇక ఎయిర్‌పాడ్స్ కూడా చార్జ్ చేయాలంటే.. నరకమే! ఈ సమస్య నుంచి బయటపడేయడానికి ‘అంబ్రేన్’ సంస్థ.. ‘ఏరోసింక్ డ్యుయో’ పేరుతో సరికొత్త ‘టూ ఇన్ వన్ మ్యాగ్‌సేఫ్ చార్జర్’ను రూపొందించింది. ఐఫోన్, ఎయిర్‌పాడ్ వినియోగదారులకు ఈ పరికరం ఓ వరంగా మారనున్నది. ఈ మ్యాగ్‌సేఫ్ చార్జర్‌పై ఒకేసారి రెండు పరికరాలను చార్జ్ చేసుకునే వీలుంది. ఫోన్ కోసం 15 వాట్స్ ఔట్పుట్, ఎయిర్‌పాడ్స్ కోసం 7.5 వాట్స్ ఔట్పుట్ పవర్‌ను అందిస్తుంది. ఐఫోన్, ఎయిర్‌పాడ్స్‌ను ఎప్పుడూ ఫుల్ చార్జింగ్‌లో ఉంచుతుంది. ప్రీమియం మెటల్‌తో తయారైన ఈ చార్జర్.. లైట్ వెయిట్, పోర్టబుల్ కూడా! ఇల్లు, ఆఫీస్‌తోపాటు ట్రావెలింగ్‌లోనూ వాడుకోవడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మ్యాగ్‌సేఫ్ చార్జర్‌తోపాటు ఫోన్ స్టాండ్‌గానూ పనిచేస్తుంది. ఏడాది వారంటీతో వస్తున్న ఈ టూ ఇన్ వన్ చార్జర్ ధర.. రూ. 2,999. ambraneindia.com ద్వారా ఆర్డర్ ఇవ్వవచ్చు.