Panduranga Ashramam | ఒక గొంతు నుంచి రమ్యమైన రామనామం. మరో గళం నుంచి అమృత తుల్యమైన కృష్ణ గీతం. ఇలా లయబద్ధంగా సాగే సామూహిక భజన.. తొలి ఏకాదశి సందర్భంగా యోగనిద్రలోకి జారుకుంటున్న వైకుంఠనాథుడికి భక్తులు పాడే జోలపాట! ఆషాఢ శుక్ల ఏకాదశి వేళ సిద్దిపేట జిల్లా మర్కూకు మండలం పాండురంగ ఆశ్రమంలో కనిపించే సన్నివేశమిది. తెలంగాణ పండరిగా పేరుగాంచిన పాండురంగ ఆశ్రమం 92వ ఆషాఢి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది.
పుండరీకుడు తలచిన వెంటనే పలికిన దేవుడు పండరిలో మాత్రమే కాదు పాండురంగ ఆశ్రమంలోనూ ఉన్నాడు. చిరునవ్వులు రువ్వుతూ రుక్మిణీ సమేతుడై దర్శనమిస్తాడు. మెదక్, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ జిల్లాలతోపాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తారు. ప్రత్యేకించి తొలి ఏకాదశికి ఆశ్రమంలో ఆషాఢి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. నాదం (భజన), సాదం (ప్రసాద వితరణ)తో ఈ క్షేత్రం అలౌకిక ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడుతుంది. ఇందులో పాలుపంచుకోవడానికి కొందరు భజనలు చేస్తూ పాదయాత్రతో ఆశ్రమానికి చేరుకుంటారు. ఇంకొందరు సపరివార సమేతంగా వాహనాల్లో వస్తారు.
పాండురంగ ఆశ్రమంలో కొలువుదీరిన శ్రీవారి దివ్య జగన్మోహన మంగళమూర్తి భక్తుల హృదయ కమలాలలో చెక్కు చెదరకుండా నిలిచిపోతుంది. స్వామివారి మూర్తి కంటికి కనిపించగానే భక్తులు పులకిస్తారు. దశాబ్దాల కిందట తెలంగాణలో భక్తి ఉద్యమానికి ఊపిరులూదిన యతిశేఖరులు శ్రీభావానంద స్వామి, విశ్వనాథ పరమ గురువులు ఇద్దరూ కలిసి తమ పరిపూర్ణమైన తపశ్శక్తిని ధారపోసి ఈ క్షేత్రాన్ని ఆవిష్కరించారు.
1932లో రుక్మిణీ సమేత పాండురంగస్వామిని ప్రతిష్ఠించి ఈ ప్రాంతాన్ని తెలంగాణ పండరీపురంగా తీర్చి దిద్దారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా దశమి, ఏకాదశి, ద్వాదశి మూడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి. వీటినే ఆషాఢి ఉత్సవాలు అని వ్యవహరిస్తారు. ఈ వేడుకను భావానంద స్వామి ‘ఆషాఢి నామక భక్తోత్సవం’ అని పేర్కొన్నారు. అంటే భక్తులందరూ కలిసి చేసుకునే పండుగ ఇది. మూడురోజులపాటు (నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు) భగవన్నామ సంకీర్తనోత్సవం అఖండంగా జరుగుతుంది.

ఉత్సవం ఇలా..
ఆషాఢ శుక్ల దశమి ఉదయం గణపతి పూజ, పుణ్యాహ వాచనంతో ఉత్సవం ఆరంభమవుతుంది. ఆ వెంటనే భక్త సముదాయం అఖండ భగవన్నామానికి శ్రీకారం చుడుతుంది. అప్పుడు మొదలయ్యే నామ సంకీర్తన ద్వాదశి నాడు అన్నదానం పూర్తయ్యే వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. మరోవైపు ఆశ్రమంలోని నాద మంటపం వేదికగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఏకాదశి రాత్రి ఆశ్రమ పరిసరాల్లో భక్తులంతా గుంపులు గుంపులుగా కూర్చొని భక్తి సంకీర్తనలు గానం చేస్తుంటారు.
ఒకచోట ఒగ్గు కథలు, మరోచోట యక్షగానాలు, ఇంకోచోట తత్వగీతాలు, అల్లంత దూరంలో ‘తందనాన రామాయణం’.. ఇలా ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత కొత్త కోణంలో ఆవిష్కృతం అవుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం పాటించినవారికి ద్వాదశి ఉదయం అన్నదానం నిర్వహిస్తారు ఆశ్రమ నిర్వాహకులు. భగవత్ ప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం.. రంగడి నామాన్ని స్మరిస్తూ తిరుగుప్రయాణం అవుతారు భక్తులు.
…?మదునూరి వెంకటరామశర్మ
78931 42535