ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్! ఇకపై వారు.. ఇన్విటేషన్స్ కోసం థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. తన వినియోగదారుల కోసం.. ‘ఆపిల్ ఇన్విటేషన్స్’ పేరుతో సరికొత్త యాప్‌ను విడుదల చేసింది ఆపిల్ సంస్థ. ఈ యాప్ సాయంతో ఐఫోన్ యూజర్లు వివిధ ఈవెంట్స్ కోసం డిజిటల్ ఇన్విటేషన్స్ తయారు చేసుకోవచ్చు. వీటికి లొకేషన్‌తోపాటు సపోర్టింగ్ ఆల్బమ్స్‌ను, ప్లే లిస్ట్లనూ జోడించవచ్చు. అలా తయారైన ఇన్విటేషన్‌ను ఐఓఎస్ వినియోగదారులకే కాకుండా.. ఆండ్రాయిడ్ యూజర్లుసహా అందరికీ పంపించుకోవచ్చు.
ఆపిల్ ఇన్విటేషన్స్ యాప్ సాయంతో ఐఫోన్, వెబ్ బ్రౌజర్ నుంచి నేరుగా కస్టమైజ్డ్ ఆహ్వానాలను తయారుచేసుకోవచ్చు. ఈ ఆహ్వాన పత్రికతోనే ఈవెంట్ వివరాలు, లొకేషన్, ఆహ్వానితులు, భాగస్వామ్య ఆల్బమ్‌లు, ఆపిల్ మ్యూజిక్, ఇతర కీలక సమాచారాన్నీ అందించవచ్చు. ఈ యాప్.. ఐక్లౌడ్, యాపిల్ మ్యూజిక్ యాప్‌లతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈవెంట్స్‌కు వచ్చే అతిథులు ఆర్ఎస్వీపీ (రెస్పాండ్ ప్లీజ్) చేయడానికి, ఈవెంట్ రిలేటెడ్ కంటెంట్‌తో ఇంటరాక్ట్ అయ్యే వీలు కల్పిస్తుంది. యాపిల్ యూజర్లు.. ఫొటో లైబ్రరీ నుంచి తమకు కావాల్సిన ఫొటోలను ఎంపిక చేసుకోవచ్చు. ఆయా సందర్భాలకు తగినట్టుగా బ్యాక్గ్రౌండ్స్నూ సెలెక్ట్ చేసుకోవచ్చు. ‘ఏఐ-పవర్డ్ కస్టమైజేషన్’ ద్వారా.. ఇన్విటేషన్‌ను మరింత అందంగా మలుచుకోవచ్చు.
ఇందులోనే రైటింగ్ టూల్స్ కూడా ఉంటాయి. వీటి సాయంతో ఇన్విటేషన్లో కంటెంట్‌ను సులభంగా కంపోజ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లోనే బిల్ట్-ఇన్‌గా.. ఆపిల్ మ్యాప్స్, వెదర్ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. దాంతో.. ఈవెంట్ జరిగే ప్రాంతంతోపాటు ఆ రోజుకు సంబంధించిన వాతావరణ విశేషాలను కూడా తెలుసుకోవచ్చు. అతిథులకు యాపిల్ అకౌంట్, ఆర్ఎస్పీవీకి ఐక్లౌడ్+ సబ్స్క్రిప్షన్ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి, నాన్ యాపిల్ యూజర్లు కూడా ఈ యాప్‌ను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు.
ప్రస్తుతం ఐఓఎస్-18 వెర్షన్లతో నడిచే అన్ని ఐఫోన్ మోడళ్లకు ‘ఆపిల్ ఇన్విటేషన్స్’ యాప్ అందుబాటులో ఉంది. యాప్ స్టోర్ ద్వారా దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనిని ఉచితంగానే వాడుకునే అవకాశం ఉంది. అయితే ఐక్లౌడ్ + సబ్స్క్రిప్షన్ ఉంటే.. మరిన్ని ప్రీమియం ఫీచర్లను పొందే అవకాశం ఉంటుంది.