ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్(2024)లో యాపిల్ సంస్థ సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది. ప్రధానంగా ఏఐ ఇంటిగ్రేషన్‌తో పాటు యూజర్లకు ఎంతగానో ఉపయోగపడే పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిల్లో ఒకటి పాస్వర్డ్ మేనేజింగ్ టూల్. నిత్యం వినియోగించే వెబ్ సర్వీసుల్ని సేఫ్‌గా వాడేందుకు ‘పాస్ వర్డ్స్’ పేరుతో కొత్త యాప్ ని పరిచయం చేసింది.
యాపిల్ యూజర్లకు ఇప్పటి వరకూ వాడుతున్న ‘ఐ క్లౌడ్ కీచైన్’ ఫీచర్‌కి ఇది కొనసాగింపు అనుకోవచ్చు. ఉచిత యాప్‌గా దీన్ని యాపిల్ పరిచయం చేసింది. యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డు వివరాలు, ఇతర సెక్యూరీటీ కోడ్స్, వై-ఫై పాస్‌వర్డ్స్‌ని సురక్షితంగా మేనేజ్ చేసుకోవచ్చు. ఒక్క అకౌంట్ అనే కాకుండా మల్టిపుల్ అకౌంట్స్‌కి ఈ ఉచిత సేవల్ని యాపిల్ యూజర్లు వాడుకోవచ్చు. ఐపోన్, ఐప్యాడ్ మ్యాక్ యూజర్లను అన్నిటిలోనూ సింక్ చేసుకోవచ్చు.
దేంట్లోనైనా ఏవైనా కొత్త లాగిన్ వివరాల్ని క్రియేట్ చేస్తే.. వెంటనే అన్ని యాపిల్ డివైజుల్లోకి సింక్ అయిపోతాయి. ఐఓఎస్ 18లో పాస్వర్డ్స్ యాప్‌తో పాటు.. ప్రైవసీని కాపాడుకునేలా ‘లాక్ యాన్ ఆప్’ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. దీంతో ఫోన్లోని ముఖ్యమైన ఫైల్స్, యాప్స్ ఇతరులకు కనిపించకుండా చేయొచ్చు. దీంతో ఎదురింటి ఏసుదాసు, పక్కింటి పరంధామయ్య పనుందని మీ ఫోన్ అడిగినా కంగారుపడకుండా ఇచ్చేయొచ్చు.