అతను నా భర్త అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. చూడకూడని సమయంలో, చూడకూడని మనిషితో చూశాను. మరుక్షణమే, అతణ్ని హత్యచేసి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. కానీ, పిల్లలు అనాథలు అవుతారన్న ఒకే ఒక్క కారణంతో.. రోజూ చస్తూ బతుకుతున్నాను. ఆవేశం తగ్గాక.. అతణ్ని క్షమించేయాలనే ఆలోచన వస్తున్నది. నా అభిప్రాయం సరైనదేనా?
ఓ సోదరి
నిజమే. జీవితభాగస్వామిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఏ భార్య అయినా.. అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటుంది. భర్తను ఇంకెవరితోనో ఊహించుకోలేక పోతుంది. తప్పు తప్పే.. ఒకసారి చేసినా వందసార్లు చేసినా. కానీ, ఒక్కసారి అతని గతం గురించి ఆలోచించు. చెడు తిరుగుళ్లు, చెడు అలవాట్లు ఉన్నాయా? లేదంటే ఏ బలహీన క్షణంలోనో, పరిస్థితుల ప్రాబల్యం వల్ల జరిగిన తప్పా? జీవితకాలం భర్త తప్పుల్ని క్షమిస్తూ బతికేస్తున్న భార్యలు చాలామందే ఉన్నారు.
ఒక్కసారి తప్పు చేసినా.. ఉపేక్షించకుండా చట్టం ముందు నిలబెట్టిన వనితలూ ఉన్నారు. అంతిమ నిర్ణయం మీది. అన్నట్టు, మీరు ఆర్థికంగా స్వతంత్రులేనా? కాకపోయి ఉంటే.. మీ కాళ్ల మీద మీరు నిలబడ్డాకే ఏ నిర్ణయమైనా తీసుకోండి. జీవితంతో రాజీపడమని చెప్పలేం కానీ.. ఏ అండా లేకుండా సమాజంలో జీవితం సాగించడం ఏమంత సులభం కాదు.