ఫ్యాషన్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ హల్చల్ చేస్తున్నది. బడ్జెట్లోనే హైరేంజ్లో చూపించే ఈ ఔట్ఫిట్.. ఔరా అనిపిస్తున్నది. అయితే ఫ్యాషన్ రంగాన్ని ఊపేస్తున్న ఈ ట్రెండ్‌ను సృష్టించింది ఏ ఫిల్మ్స్టారో.. పేరున్న ఫ్యాషన్ డిజైనరో కాదు. బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన మేఘన్ మార్కెల్! నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘విత్ లవ్, మేఘన్’లో.. ఈ తరహా ఔట్ఫిట్లో కనిపించి అందరినీ ఫిదా చేసింది మేఘన్. ఈ ఔట్ఫిట్ ‘హై-లో ఫ్యాషన్’ పేరుతో ట్రెండింగ్‌లో ఉన్నది. హై-లో ఫ్యాషన్ అంటే.. హైఎండ్ డిజైనర్ దుస్తులపైకి సాధారణ యాక్ససరీస్‌ను జత చేయడమే! రెండిటినీ కలిపి అధునాతన, స్టయిలిష్ లుక్‌ను తీసుకురావడమే! ఈ ప్రత్యేకమైన ఫ్యాషన్.. లోబడ్జెట్లోనే హైరేంజ్ లుక్‌ను తీసుకొస్తుందని అంటున్నారు డిజైనర్లు. ఇందులో భాగంగా.. డిజైనర్ హ్యాండ్ బ్యాగ్‌ను సాధారణ టీ-షర్ట్, జీన్స్‌తో జత చేయవచ్చు.
సాధారణ దుస్తులతో లగ్జరీ స్కార్ఫ్‌ను ధరించవచ్చు. ‘విత్ లవ్, మేఘన్’లో డచెస్ ఆఫ్ సస్సెక్స్ మేఘన్ కూడా ఇలాగే కనిపించింది. హైఎండ్ డిజైనర్ దుస్తులతోపాటు సాధారణ యాక్సెసరీస్నూ ఔట్ఫిట్లో భాగం చేసింది. ఈ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్.. జేబులకు చిల్లులు పెట్టకుండానే వివిధ రకాల ఔట్‌ఫిట్స్‌ను సృష్టిస్తుంది. ఫ్యాషన్‌గా, సౌకర్యవంతంగా ఉంటూ.. అన్ని సందర్భాలకూ అనుగుణంగా ఉంటుంది. అంతేకాదండోయ్.. ఫ్యాషన్‌లో కఠినమైన నియమాలకు కట్టుబడి ఉండకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించే స్వేచ్ఛను కల్పిస్తుంది. ఈ సరికొత్త ఫ్యాషన్ ఎంపికలు.. మీ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే సాధనంలానూ ఉపయోగపడుతాయి. మరి ఇంకెందుకాలస్యం.. ఈ నయా మిక్స్డ్ ఫ్యాషన్‌ను ఎంచుకోండి. మీ వార్డ్‌రోబ్‌లో ఉన్నవాటిలోంచే విస్తృతమైన ఔట్‌ఫిట్స్‌ను సృష్టించండి. బడ్జెట్‌ను త్యాగం చేయకుండానే.. సరికొత్త ట్రెండ్‌ను ఫాలో అవ్వండి.