“పేదరికంతో డబ్బులకు ఇబ్బంది పడుతున్న కాలం. రోజంతా పనిచేసి తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటికి వెళ్తే.. మా అబ్బాయి నా కోసం ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇద్దరం కలిసి తల్లెలు పెట్టుకొని తినేవాళ్లం. ఇప్పుడు సంపద పెరిగింది. చిన్న ఇంటి స్థానంలో భారీ భవంతి. ఇప్పుడు సాయంత్రం ఎనిమిది గంటలకు ఇంటికి వెళ్లినా.. ఎదురుచూసే వాళ్లు ఉండరు. రెండు పెంపుడు కుక్కలు ఉంటాయి. నేను కనిపించగానే.. అవే పలకరిస్తాయి. ఎక్కువ డబ్బులు మంచిది కాదు!”..
ఈ మాటలు అన్నది డబ్బు సంపాదించడం తెలియని ఏ అనామకుడో కాదు. ఇంగ్లిష్ చదువు లేని స్కూల్‌తోనే చదువు ముగించి, వ్యాపార సామ్రాజ్యంలో విజేతగా నిలిచి.. రెండు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీల యజమాని అనిల్ అగర్వాల్. ఇతను బిహారీ. పెద్దగా చదువు లేదు. ఎలాగోలా కష్టపడి స్కూల్ చదువు పూర్తిచేశాడు. ఇంగ్లిష్ నేర్చుకోమని తండ్రి ఎంత కొట్టినా.. “ఇంగ్లిష్ మా డీఎన్ఏలోనే లేదు!” అంటాడు.
ఇంటికి వెళ్లినప్పుడు పెంపుడు కుక్కలు తప్ప మన కోసం ఎదురు చూసేవారు ఉండరు అంటే.. దాని అర్థం భార్యా పిల్లలకు తనమీద ప్రేమ లేదని కాదు.
వారికి అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ, సంపద బాగా పెరిగిపోయినప్పడు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఇది మనం వద్దు అనుకున్నా జరిగి తీరుతుంది. సంపదతోపాటు ఇది వచ్చి తీరుతుంది అనేది అనిల్ అగర్వాల్ అభిప్రాయం. ఇంగ్లిష్ నేర్పడానికి వచ్చిన ట్యూటర్.. తనవల్ల హిందీ నేర్చుకొని వెళ్లాడు కానీ.. తనకు మాత్రం ఇంగ్లిష్ రాలేదని అనిల్ నవ్వుతూ చెబుతాడు. రెండు లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీల యజమాని.. సామాన్య బిహారీ గ్రామీణుడిలా ఉంటాడు.
“ఇలా ఉండవద్దని మీ ప్రచారకర్తలు చెప్పరా?” అని అడిగితే..
“చెప్పిచెప్పి.. కుక్క తోక వంకరని వదిలేశారు. నేను నాలానే ఉంటాను” అంటాడు. స్టాక్ మార్కెట్‌తో పరిచయం ఉన్నవారికి వేదాంత,
హిందుస్థాన్ జింక్ పేర్లు తెలియకుండా ఉండదు.
మంచి డివిడెండ్లు చెల్లించడంలో ఈ కంపెనీలు ముందు వరుసలో ఉంటాయి. ఇలాంటి రెండు మూడు కంపెనీల డివిడెండ్లతో ఇంటి ఖర్చు వెళ్లదీసే కుటుంబాలు బోలెడు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు అనిల్ అగర్వాల్వే.
ఎన్నో కలలు, జేబులో పెద్దగా డబ్బు లేదు. అయినా.. ఏదో సాధించాలని ముంబైలో అడుగుపెట్టాడు. రోజుకు 20 రూపాయలు మడత మంచానికి చెల్లించి పడుకునేవాడు. అర్ధరాత్రి కూడా వడపావ్ దొరికేది. దాంతోనే కడుపు నింపుకొనేవాడు. ఇప్పుడు లండన్‌లో పెద్ద స్టూడియో, భారీ భవనాలు ఉన్నా.. 20 రూపాయల మడత మంచం, వడపావ్ రోజులే అద్భుతం అనిపిస్తాయంటూ తన జీవితపు ప్రారంభపు రోజులను గుర్తు చేసుకుంటాడు.
ఏదైనా పెద్దగా సాధించాలి
1954 జనవరి 24న బిహార్‌లోని పట్నాలో అగర్వాల్ కుటుంబంలో జన్మించాడు అనిల్. తండ్రి ద్వారకా ప్రసాద్ అగర్వాల్.. చిన్న స్థాయిలో అల్యూమినియం కండక్టర్ల వ్యాపారం చేసేవాడు. వీటికోసం అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగేవాడు. అధికారుల ఇళ్లల్లో పెళ్లి వంటి కార్యక్రమాలు జరిగితే కుమారుణ్ని కూడా తీసుకువెళ్లి.. వాళ్ల కాళ్లు మొక్కమని కాళ్ల మీద పడేసేవాడు. అధికారులు, రాజకీయ నాయకుల ఇళ్లలో శుభకార్యాలకు చిన్నచిన్న పనులు చేసి, వాళ్లను ప్రసన్నం చేసుకోవాలనే తండ్రి ప్రయత్నం.. తనకు చిన్నప్పటి నుంచీ నచ్చేది కాదని అంటాడు అనిల్. బాల్యం నుంచే తన ఆలోచనలు ‘ఏదైనా పెద్దగా సాధించాలి’ అనే ఉండేవి.
అల్యూమినియం ఫ్యాక్టరీకి షేరింగ్ కారులో 8 నుంచి పది మంది కలిసి వెళ్లేవారు. ‘కారులో కేవలం నలుగురితోనే వెళ్లాలి’ అనేది తన జీవితంలో మొదటి లక్ష్యమని చెబుతాడు. తండ్రి అల్యూమినియం కండక్టర్ల చిన్న వ్యాపారమైతే.. ఇప్పుడు అనిల్ అగర్వాల్ దేశంలో తొలిసారి లక్ష కోట్ల పెట్టుబడితో గుజరాత్లో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నాడు. సెమీ కండక్టర్ రంగంలో చైనా వంటి దేశాలపై ఆధారపడకుండా దేశం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో ఈ ప్లాంట్‌కు గుజరాత్లో శంకుస్థాపన చేయించాడు.
బిహార్ జోక్స్‌తో మార్గం
తాను ముంబై వెళ్లినప్పుడు రోడ్డుమీద ధీరూబాయ్ అంబానీ రిలయన్స్‌కు చెందిన భారీ హోర్డింగ్స్ కనిపించేవి. టాటా, అంబానీ, బిర్లా, గోయెంకా.. వీళ్లు ఫలానా కంపెనీ కొన్నారు అనే వార్తలు చదివినప్పుడు తానూ కొనాలని కలలు కనేవాడట. 14-15 ఏళ్ల వయసులోనే ధీరూభాయ్ అంబానీ గురించి ఆలోచించేవాడు. “అంబానీ, బిర్లా వంటి హేమాహేమీలు ఒబెరాయ్ హోటల్ హెల్త్ క్లబ్లో కలుసుకుంటారని తెలిసి, ఒకరోజు సిబ్బందికి డబ్బులిచ్చి, వెయిటర్‌ను బతిమిలాడి అక్కడికి వెళ్లి దూరంగా కూర్చున్నాను. వ్యాపారం, దేశ రాజకీయాల వంటి అనేక అంశాలపై వాళ్లు మాట్లాడుకునేది విన్నాను. అదును చూసి వాళ్ల వైపు తిరిగి.. ‘బిహార్ జోక్స్ చెప్పాలా?’ అని అడిగాను. చెప్పమన్నారు. నేను జోక్స్ చెప్పగానే పడిపడి నవ్వారు. ‘రేపుకూడా రా!’ అని పిలిచారు. అలా.. అక్కడికి వెళ్లడానికి నాకు మార్గం లభించింది!” అంటూ చెప్పుకొచ్చాడు.
ఆకాశమే హద్దు
“ఇప్పటి యువత ఉద్యోగం దొరికితే చాలనే ఆలోచనకు పరిమితం కావద్దు. ఎదిగేందుకు కలలు కనాలి. ‘ఇంగ్లిష్ వస్తే చాలు.. ప్రపంచాన్ని జయించేస్తాం’ అనుకోవద్దు. అదే విధంగా ఇంగ్లిష్ రాకపోతే ఏమీ చేయలేమనే ఆలోచన కూడా తప్పు. నాకు ఇంగ్లిష్ రాదు. కానీ నేను ఎలాగోలా కష్టపడి నా కంపెనీని లండన్ స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ చేయించాను. వేల కోట్ల రూపాయలు లండన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ దేశంలోకి తీసుకురాగలిగాను. ఒక దశ దాటిన తరువాత డబ్బు మీద వ్యామోహం పోతుంది. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో నేను ప్రతి పనిలో డబ్బును చూసేవాణ్ని.
ఇప్పుడు ఒక వ్యాపారాన్ని పెద్దఎత్తున చేయాలని, దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని, దేశం ప్రపంచంలో మేటిగా నిలవాలని కోరుకుంటూ వ్యాపారం చేస్తాను. ‘మాతో కాదు.. మేం ఇంతే!’ అనే నిరాశావాదం దరి చేరనివ్వవద్దు. ఆకాశమే హద్దు అనుకొని ముందుకు వెళ్లాలి” అని యువతకు ప్రేరణనిస్తాడు. “ప్రతివ్యక్తి నుంచీ నేను నేర్చుకుంటాను. మా నాన్న చిన్నప్పుడు రాజకీయ నాయకులు, అధికారుల కాళ్ల మీద పడేసేవారు. నాకది నచ్చలేదు కానీ, అక్కడ కొన్ని విషయాలను నేర్చుకున్నాను. అధికారికి బాదంపప్పు ఇష్టమైతే.. దాన్ని తీసుకొని మాకు ఒక్క గింజకూడా ఇవ్వకుండా ఆ అధికారికి ఇచ్చేవారు మా నాన్న. మనుషులను ఎలా ప్రసన్నం చేసుకోవాలి? వారికి నచ్చినట్టు ఎలా మాట్లాడాలి? అనేది అక్కడే నేర్చుకున్నాను” అని చెబుతాడు.
అనిల్ అగర్వాల్ మంచి జానపద గాయకుడు కూడా. జీవితంలో ఏదీ కాకపోతే పాటలు పాడి బతికేద్దాం అనుకొని జానపద గీతాలు ఆలపించేవాడట. ఇండియాలో వ్యాపారం చేస్తున్నా.. ఆశించిన గుర్తింపు రాకపోవడంతో లండన్‌పై దృష్టి సారించి అక్కడ కంపెనీలు పెట్టాడు. లండన్‌లో సాధించిన గుర్తింపుతో ఇండియాకు రాగానే.. ‘ఏం చదివావు? కుటుంబ నేపథ్యం ఏమిటీ? అనే ప్రశ్నలు లేకుండానే ఘనస్వాగతం లభించింది.
మనుషులు- గనులు
భూమి లోపల ఖనిజ సంపద, భూమిపైన మానవ సంపద.. ఈ రెండే ఏ దేశాన్ని అయినా సంపన్న దేశంగా మారుస్తాయి. దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగిన అనిల్ అగర్వాల్.. భారత్‌ను మించిన దేశం లేదని అంటాడు. సాంకేతిక నైపుణ్యం ఉన్న యువత ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఇక్కడ ఉంది. అదే విధంగా భూగర్భంలో ఖనిజ సంపద ఉంది. భూమి పైన, భూమి లోపల ఉన్న ఈ సంపదను సరిగా ఉపయోగించుకుంటే.. భారత్‌కు తిరుగులేదు అనేది అగర్వాల్ నమ్మకం.
పాతతుక్కు నుంచి మైనింగ్ దాకా
అనిల్ అగర్వాల్ తొలుత పాతతుక్కు వ్యాపారం చేసేవాడు. 1976లో 22 ఏళ్ల వయసులో షంషేర్ స్టెర్లింగ్ కార్పొరేషన్‌ను కొన్నాడు. ఇది టెలికాం కేబుల్స్ తయారుచేసే కంపెనీ. తొలుత దీనిలో తుక్కును కొని ఫ్యాక్టరీలకు అమ్మేవారు. షంషేర్ స్టెర్లింగ్ దివాలా తీయడంతో ధైర్యం చేసి దాన్ని కొన్నాడు. ఆ సమయంలో తనవద్ద డబ్బు లేకపోయినా.. తండ్రి ఇచ్చిన ఐదు లక్షలు, మిత్రుని నుంచి ఐదు లక్షలు, మేనమామ నుంచి ఐదు లక్షలు తీసుకొని.. 15 లక్షలకు ఆ కంపెనీని దక్కించుకున్నాడు. టెలిఫోన్ కోసం ఏడేళ్లపాటు వేచిచూసే కాలం అది. టెలికం విప్లవంతో వీరి కంపెనీకి మంచి ఆర్డర్స్ వచ్చాయి. 15 లక్షల నుంచి రెండు లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీల వరకు అగర్వాల్ సామ్రాజ్యం విస్తరించడానికి ప్రారంభం ఈ తుక్కు వ్యాపారమే!
మాస్ మసాలా సినిమా
ఎదగాలి అనే కోరిక బలంగా ఉండాలి కానీ.. ఇంగ్లిష్ రాదు, చదువు అంతంత మాత్రమే అనే అడ్డంకులు ఏవీ ఉండవు. మనసు ఉంటే ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు అని.. అనిల్ అగర్వాల్ జీవితం నిరూపిస్తుంది. హర్షద్ మెహతా వివాదంలో అగర్వాల్ పేరు వినిపించింది. వీరి కంపెనీలకు వ్యతిరేకంగా పర్యావరణ ఉద్యమాలు వచ్చాయి. “ఇలాంటివి గతంలో వచ్చాయి. భవిష్యత్తులోనూ వస్తాయి. తప్పు చేయనప్పుడు వీటికి భయపడాల్సిన అవసరం లేదు” అనేది తన అభిప్రాయం అంటాడు అగర్వాల్. విమర్శలు ఎలా ఉన్నా అగర్వాల్ జీవితం ఒక మాస్ మసాలా సినిమా అంత ఆసక్తిగా ఉంటుంది. లక్షల కోట్ల సామ్రాజ్యాలను నిర్మించినా.. మట్టి వాసనలు మాత్రం పోలేదని అనిపిస్తుంది అనిల్ అగర్వాల్ జీవితాన్ని చూస్తే.
రాజేశ్ ఖన్నా – అగర్వాల్
అనిల్ అగర్వాల్ పెళ్లి కూడా సినిమాలాగే ఉంటుంది. అగర్వాల్ తండ్రి మిత్రుని కుమార్తెను అనిల్ అగర్వాల్‌కు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. అగర్వాల్ ముంబై వెళ్లడంతో ఆ రోజుల్లో చిన్న పట్టణం నుంచి ముంబై వెళ్లడం అంటే.. స్మగ్లింగ్‌లాంటి ఏదో తప్పుడు పని చేస్తున్నాడని అనుకునేవారు. దాంతో ఆమె వివాహాన్ని మరొకరితో జరిపించారు. అగర్వాల్ వచ్చి అడిగితే విషయం తెలిసింది. తండ్రి మిత్రునికి ఆ కూతురుతోపాటు 15 ఏళ్ల మరో కుమార్తె కిరణ్ గుప్తా ఉందని తెలిసి.. ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ రోజుల్లో రాజేశ్ ఖన్నాకు ఉత్తరాదిలో మంచి క్రేజ్ ఉండేది. ‘మీకు రాజేశ్ ఖన్నా అంటే ఇష్టమా!?’ అని కిరణ్‌ను అడిగితే.. ‘చాలా ఇష్టం’ అని చెప్పిందట. దాంతో.. ‘అనిల్ కూడా ముంబైలోనే ఉంటాడు.
రాజేశ్ ఖన్నా అక్కడే ఉంటాడు. మీరు అనిల్‌ను పెళ్లి చేసుకుంటే.. ముంబై వెళ్లి రాజేశ్ ఖన్నాను చూడొచ్చు!’ అని చెబితే.. ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకొన్నదట. అమితాబ్, షారుక్ ఖాన్‌తోపాటు బాలీవుడ్లో చాలామంది నటులతో అగర్వాల్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. లండన్‌లోని వీరి ఇంటికి వాళ్లు తరుచుగా వస్తుంటారు. “అమితాబ్ ఇంటికి నేను వెళ్లాను. మా ఇంటికి అమితాబ్ వచ్చారు. కానీ, ముంబైలో ఉన్నప్పుడు.. సినిమా టాకీస్‌లో దెబ్బలు తింటూ కూడా ‘షోలే సినిమా’ చూసిన రోజు నాకు ఇప్పటికీ అద్భుతమైన జ్ఞాపకం” అని చెబుతాడు అనిల్ అగర్వాల్.
…? బుద్దా మురళి
98499 98087