వైఫై మహా అయితే డేటా సిగ్నల్స్ ఇస్తుంది. చూడటమేంటి? చెప్పడమేంటి? అనుకుంటున్నారా! ఇక ఈ వైఫై నిఘా వ్యవస్థలా కూడా పని చేస్తుంది. కాదూ.. కూడదని.. నా ఇగో హర్ట్ అయ్యిందని ఇంట్లోకి ప్రవేశిస్తే.. సిగ్నల్స్ మిమ్మల్ని స్కాన్ చేస్తాయి. వెంటనే ఇంట్లో వాళ్లని అలర్ట్ చేస్తాయి. ‘ఇదేందయ్యా.. ఇది! ఇదెప్పుడూ నేను చూడలా!!’ అని నోరెళ్లబెట్టొద్దు. ఎందుకంటే.. ఇది తర్వాతి జనరేషన్ వైఫై. డచ్ స్టార్టప్ దీన్ని రూపొందించింది. దీని పేరు ‘గ్యామ్జీ’. ఇదో అలారం వ్యవస్థ. ఇంట్లో ఉన్న వైఫై నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయ్యి పనిచేస్తుంది.
ఇంటిల్లిపాది బాడీ ప్రింట్స్‌ని స్కాన్ చేసి పెట్టుకుంటుంది. పెంపుడు జంతువుల్ని కూడా ఇది గుర్తిస్తుంది. ఎవరైనా కొత్తవాళ్లు ఇంట్లోకి ప్రవేశిస్తే.. వెంటనే హెచ్చరిస్తుంది. ఈ అలారం సిస్టమ్‌ని ఇన్స్టాల్ చేశాక.. మొదటి రెండువారాలు ట్రైనీ వ్యవస్థలా పనిచేస్తుంది. ఇంట్లోవాళ్లని.. రెగ్యులర్‌గా ఇంటికి వచ్చి వెళ్లేవారిని రికార్డు చేసుకుంటుంది. ఆ తర్వాత ఇంట్లోకి కొత్త వ్యక్తి ఎవరొచ్చినా అలర్ట్ చేస్తుంది.
వృద్ధులకు నీడగా..
‘ఇగో వై-ఫైలా ఎప్పుడూ నా వెంటే ఉంటుంది’ అనే డైలాగ్ ఇప్పుడు ఇంట్లో పెద్దలకు సరిపోతుంది. ఎందుకంటే.. ఈ అలారం వ్యవస్థ వయసుమళ్లిన పెద్దల చుట్టూ తిరుగుతూ.. వారికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అనుకోకుండా.. హాల్లోనో.. బాత్రూమ్లోనో వాళ్లు జారిపడితే.. వెంటనే అలర్ట్ చేస్తుంది. వారు పడిపోయిన విషయాన్ని ఇంట్లోవాళ్లకి తెలిపి అప్రమత్తం చేస్తుంది.
ఈ మొత్తం అలారం వ్యవస్థని ఫోన్ నుంచే మానిటర్ చేయొచ్చు. అందుకో ప్రత్యేక యాప్ కూడా ఉంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు.. వైఫై సిగ్నల్స్‌ని వాడుకుంటూనే ఇంటిపై ఓ కన్నేయొచ్చు. ఇక ప్రైవసీ విషయానికొస్తే.. గ్రహించిన మొత్తం మోషన్ డేటాని ప్రాసెస్ చేసి ఇంట్లోని రూటర్స్లో భద్రం చేస్తుంది. ఎలాంటి క్లౌడ్ స్టోరేజ్‌తో పనిలేదు. సో.. యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీకి ఎలాంటి డోకా ఉండదు. ప్రస్తుతం ఫండింగ్ దశలో ఉన్న ఈ నిఘా వ్యవస్థ త్వరలోనే మార్కెట్లోకి రానుంది.