కాలేజీ రోజుల్లో.. టీనేజీ మోజు చాలా సహజం. అయితే, ఒకప్పుడు ఈ దశలో మహా అయితే.. బోటనీ పాఠం ఎగ్గొట్టి మ్యాటనీ ఆటకు వెళ్లేవాళ్లు! కానీ, ఇప్పుడు కౌమారం మరింత మారాం చేస్తున్నది. ఓటీటీ కంటెంట్‌కు పేటెంట్ రైట్ వాళ్లదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు టీనేజర్లు. వర్చువల్ వరల్డ్‌లో విచ్చలవిడిగా విహరిస్తున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు.. జెండర్‌తో సంబంధం లేకుండా, అడల్ట్ కంటెంట్‌ను
చాటుగా ఆస్వాదిస్తున్నారు. జీవితానికి చేటు చేసుకుంటున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అడలెసెన్స్’ చూసిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో టీన్స్ భద్రతపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అమాయకత్వాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ వెబ్‌సిరీస్ హెచ్చరించింది. ఎవరికీ అర్థం కాని ఎమోజీ భాషలో మాట్లాడుకుంటున్న ఈతరాన్ని మానిటర్ చేయకపోతే.. తర్వాత జరిగే పరిణామాలు ఊహించడం కష్టమే అంటున్నారు నిపుణులు.
సామాజిక మాధ్యమాల్లో భాష రోజుకో కొత్త రూపు సంతరించుకుంటున్నది. పొడి పొడి అక్షరాల్లోనే ఎన్నెన్నో భావాలు పంచేసుకుంటున్నారు పిల్లలు. చిత్రవిచిత్రమైన ఎమోజీలతో ఎమోషన్స్ షేర్ చేసుకుంటున్నారు. సాదాసీదా ఎమోజీ అని మనం అనుకుంటాం. కానీ, వాటి వెనుక ఊహకు అందని భావాలు దాగి ఉంటున్నాయి. ఉదాహరణకు ‘రెడ్ పిల్ ఎమోజీ’కి ‘నువ్వు దాచిపెడుతున్న నిజం ఏంటో నాకు తెలుస’ని భావం. అంతేకాదు ఎమోజీల్లో వాడే హార్ట్ సింబల్స్లోని రంగుల వ్యత్యాసాలు కూడా పలు రకాల అర్థాలు మోసుకెళ్తాయట. ఇది జెన్ జీలకు మాత్రమే తెలిసిన కోడ్ లాంగ్వేజ్! దీన్ని డీ కోడ్ చేయకుంటే.. మీ పిల్లలు ఏ దిశగా వెళ్తున్నారో అర్థం చేసుకోలేరు!!
సామాజిక మాధ్యమాల్లో, ఓటీటీ కంటెంట్‌లో హింస, డ్రగ్స్, సెక్స్ తదితర అంశాలు గ్లామరైజ్ చేసి చూపిస్తున్నారు. ఇవి యువత భావోద్వేగాలను అస్థిరపరుస్తున్నాయి. ఈ క్రమంలో చాలామంది క్రైమ్‌కు దగ్గర అవుతున్నారు. లైంగిక హింసకు ప్రేరేపితులు అవుతున్నారు. అంతులేని హింసను కలర్ఫుల్గా చూపించడం, ఏ మాత్రం సెన్సార్ లేని కంటెంట్ గిగాబైట్ల కొద్దీ అందుబాటులోకి రావడంతో.. కౌమార దశలో పిల్లలు దీనికి విపరీతంగా అడిక్ట్ అవుతున్నారు. ఆన్లైన్ రిలేషన్స్‌కు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకసారి వీటికి రుచి మరిగితే.. మీ పిల్లల్ని నియంత్రించడం తలకు మించిన భారమే అవుతుంది. కాబట్టి, పిల్లల ఆన్లైన్ విహారంపై నిఘా ఉంచాల్సిందే! డిజిటల్ దునియాలో ఉన్న ఉచ్చుల గురించి వారికి విడమర్చి చెప్పాల్సిందే. పోనీలే అని చూసీ చూడనట్టు వదిలేస్తే.. వారికి కౌమారం ఓ పీడకలలా పరిణమించే ప్రమాదం ఉంది.