చదువు ఒక్కటే సమాజంలో మార్పును తీసుకురాగలదని ఆ ఇద్దరు యువతులు నమ్మారు. చదువులమ్మను నిరుపేద విద్యార్థుల చెంతకు తీసుకువెళ్లాలని సంకల్పించుకున్నారు. ‘బ్లూ లైలక్’ పేరుతో ఎన్జీవోను ప్రారంభించి వేలమంది చిన్నారులకు అక్షరాన్ని కానుకగా అందిస్తున్నారు చెన్నైకి చెందిన అదితి శ్రీవత్సన్, నేహ గోవిందరాజన్. నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు అందజేయడమే వీరి పని. గతేడాది వేసవిలో ‘బ్లూ లైలక్’ సంస్థ మొదలైంది. మరో ఔత్సాహిక యువతి తనుశ్రీ వీరిద్దరితో జట్టుకట్టింది. ముగ్గురు కలిసి పుస్తకాలను సేకరించి ఏడాది తిరక్కుండానే ఆరు గ్రంథాలయాలు నెలకొల్పారు.
విరాళంగా సేకరించిన పుస్తకాలను అవసరమైన విద్యార్థులకు అందజేస్తూ విద్యావకాశాలను సుగమం చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు ఆరువేల మంది విద్యార్థులు ‘బ్లూ లైలక్’ ద్వారా పుస్తకాలు అందుకున్నారు. అంతేకాదు పిల్లల్లో నైపుణ్యాలు పెంచే దిశగా తరచూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంటారు. ‘సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ మేం వెల్కమ్ చెబుతున్నాం. మాతో చేతులు కలపండి. పుస్తకాలను విరాళంగా ఇవ్వండి’ అని పిలుపునిస్తున్నారు ఈ ముగ్గురు. మరిన్ని వివరాలకు https://bluelilacchennai.weebly.com సైట్‌ని చూడొచ్చు.