నా బాల్య స్నేహితురాలి పేరు ప్రియ. పాఠశాల రోజుల నుంచీ మేం బెస్ట్ ఫ్రెండ్స్. కలిసే కాలేజీకి వెళ్లాం. ఒకే రోజు తొలి ఉద్యోగంలో చేరాం. నా సలహా తీసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంది. కానీ, తల్లి కాగానే తన ఆలోచనలు మారాయి. కావాలనే నన్ను దూరం పెడుతున్నది. ఫోన్ చేసినా పెద్దగా స్పందించదు. పాపతో బిజీగాఉన్నానంటూ కట్ చేస్తుంది. కానీ మిగిలిన వాళ్లతో బాగానే ఉంటుంది. ఎందుకిలా? నేను గొడ్రాలిననే చిన్నచూపా?
– ఓ పాఠకురాలు
పిల్లలతోపాటే అమ్మ కూడా పుడుతుంది. బిడ్డ తొమ్మిది నెలలు గర్భంలో ఉంటాడు. తల్లి తొమ్మిది నెలలు గర్భాన్ని మోస్తుంది. పెద్ద ప్రాణానికైనా, చిన్న ప్రాణానికైనా అదో గండమే. ఆ సమయంలో తల్లి అనేక మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటుంది.
ఆ ప్రభావాల్లో ఇదీ ఒకటి కావచ్చు. కొంతకాలం పాటు తనను తనలా ఉండనివ్వండి. తన ప్రపంచంలో తనను బతకనివ్వండి. ఇతర మహిళలతో ఆమె మాట్లాడటానికి కారణం.. వారి నుంచి పిల్లల పెంపకానికి సంబంధించిన చిట్కాలు నేర్చుకోవడమే కావచ్చు. తను నిజంగా బాధ్యతల్లో తలమునకలై ఉంటే.. మీ వంతుగా ఏమైనా సాయం చేయగలరేమో ఆలోచించండి. అంతేకానీ, ఆ బాలింతను అపార్థం చేసుకోవద్దు. స్నేహితురాలిని దూరం చేసుకోవద్దు.