పిల్లల పెంపకంలో తల్లి కీలక పాత్ర పోషిస్తుంటుంది. చాలామంది తండ్రులు అతిథి పాత్ర పోషిస్తుంటారు. ఆర్థిక అవసరాలకే పరిమితం అవుతుంటారు. కానీ, తల్లి కంటే.. పిల్లలు తండ్రిని చూసే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నాన్నలు వెన్నంటి ఉంటే… ఆ పిల్లలు అద్భుతాలు చేయగలరని అంటున్నాయి.
పిల్లల జీవితంలో తండ్రి పాత్ర కూడా కీలకమే. చిన్నారులు సామాజికంగా, మానసికంగా ఎదగడానికి నాన్న ఆలనపాలన అవసరం. అందుకే, ఎంత ఒత్తిడిలో ఉన్నా.. ప్రతిరోజూ పిల్లల కోసం తండ్రులు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి.
గతంతో పోలిస్తే.. ఈ తరం తండ్రులు పిల్లలతో చొరవగానే ఉంటున్నారని పలు సర్వేల సారాంశం. అయితే, ఇప్పటికీ కొందరు పాత తరం పోకడనే ఫాలో అవుతున్నారట. పిల్లల హోమ్‌వర్క్ బాధ్యత తమది కాదన్నట్టుగా వ్యవహరిస్తుండటం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది. పాఠశాలలో జరిగే పేరెంట్ మీటింగులకు తల్లులే ఎక్కువగా హాజరవుతుండటం కూడా తండ్రుల పాత్రను ప్రశ్నిస్తున్నది. దీనికి ఎవరికి వారు సమాధానం చెప్పుకోవాలి. తండ్రిగా తమ బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలి.
చదువు విషయంలో తండ్రులు శ్రద్ధ వహిస్తే పిల్లల్లో శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. వారిలో ఆత్మన్యూనతా భావం తగ్గి చురుగ్గా ఉంటారు. హైస్కూల్, కాలేజీ వయసుకు వచ్చిన పిల్లలకు తండ్రి మార్గదర్శకుడిగా కనిపించాలి. బిడ్డలు చెడుసావాసాలకు గురయ్యేది ఇప్పుడే! ఆ సమయంలో తండ్రి స్నేహితుడిగా మారగలగాలి. వారితో అనేక విషయాలు చర్చించాలి. రాజకీయ అంశాలు, ఖర్చు, పొదుపు, సమాజం పోకడ తదితర విషయాలు వారితో చర్చించడం వల్ల ఆయా విషయాలపై వారికి మంచి అవగాహన కలుగుతుంది. తండ్రితో అనుబంధమూ పెరుగుతుంది.