నాలుగు గోడల మధ్య నదిని పారిస్తాడు. అంతలోనే అంతులేని అగాధాన్ని సృష్టిస్తాడు. ఉన్నది లేనట్టుగా భ్రమింపజేస్తాడు. లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేస్తాడు. అంతా త్రీడీ మాయ. రారాజు సుయోధనుడు సైతం మయసభలో బోల్తాపడ్డాడంటే దటీజ్ త్రీడీ ఆర్ట్ మహిమ అంటాడు సింగారపు శివరామకృష్ణ. దేశదేశాల్లో రికార్డుల మోత మోగిస్తున్న ఈ మంథని యువకుడు అరుదైన త్రీడీ ఆర్ట్ కళను మరెందరికో చేరువ చేస్తున్నాడు.
చిన్నప్పటి నుంచి శివరామకృష్ణకు బొమ్మలు గీయడం అంటే సరదా! అమ్మ శిష్యరికంలో చిత్రలేఖనంలో పట్టు సాధించాడు. నాన్న ప్రోత్సాహంతో త్రీడీ ఆర్ట్‌లో చేయి తిరిగిన కళాకారుడు అయ్యాడు. మంథని జేఎన్టీయూ కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు ఎస్ఎస్ ఆర్కే అకాడమీ నెలకొల్పి ఎందరికో త్రీడీ ఆర్ట్‌లో శిక్షణనిస్తున్నాడు. శివరామకృష్ణ శిష్యుల్లో అమెరికా, రష్యా వాళ్లూ ఉన్నారు. ‘త్రీడీ ఆర్ట్ అరుదైనది. ఈ తరహా బొమ్మలు గీసే కళాకారులను మనదేశంలో వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఈ కళమీద పట్టు దొరకడం నిజంగా నా అదృష్టం’ అంటాడు శివరామకృష్ణ. త్రీడీ ఆర్ట్‌లో పట్టుసాధించిన ఆయన ఇప్పుడు ఈ కళకు పాఠ్యపుస్తకాలను తయారు చేసేస్థాయికి ఎదిగాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిక్ వరల్డ్ రికార్డ్స్ లాంటి 10 ప్రపంచ రికార్డులను సాధించాడు.
యునైటెడ్ థియలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ కాలిఫోర్నియా గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు. రోడ్డు ప్రమాదాల నివారణ నేపథ్యంలో ఆయన వేసిన త్రీడీ స్పీడ్ బ్రేకర్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. వివిధ దేశాలకు చెందిన ప్రసార మాధ్యమాల్లో దీనికి విస్తృతమైన ప్రచారం లభించింది. ‘త్రీడీ ఆర్ట్ పురాతన భారతీయ కళ. మహాభారతంలో కనిపించే మయసభలోని అద్భుతాలకు ఈ కళే మూలం. మనదైన కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలన్నదే నా కల’ అంటున్నాడు శివరామకృష్ణ.
…? అంకరి ప్రకాశ్
తూర్పాటి శ్రీనివాస్