ఖమ్మం సిటీ, జూలై 20 : ఇది సినిమా కథ కాదు.. డైలీ సీరియల్లో సన్నివేశం అంతకన్నా కాదు.. జిల్లా కేంద్రమైన ఖమ్మం నడిబొడ్డున సర్కారు దవాఖానలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటన. ఒక మహిళ పాము కాటుకు గురై, తీవ్ర భయాందోళనతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే స్థానిక వైద్యులు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చానీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మంరూరల్ మండలం వెంకటగిరి క్రాస్‌రోడ్డులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన గండికోట వెంకటమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
రోజువారీగానే శుక్రవారం ఉదయాన్నే అదే గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన కూరగాయల చేనులో పనికి వెళ్లింది. మధ్యాహ్నం 1 గంటకు ఇంటికి బయలుదేరగా పాముకాటు వేసింది. విషయాన్ని రైతుకు తెలియజేయగా, ఆయన ఆటోలో హుటాహుటిన బాధితురాలిని ఖమ్మంలోని జిల్లా సార్వజనీన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. నడిచే ఓపిక లేని ఆమెను స్ట్రెచర్‌లో కూర్చోబెట్టుకుని క్యాజువాలిటీ వార్డుకు వెళ్లాడు. ఎదురుగా ఉన్న గదిలో ముగ్గురు మహిళా వైద్యురాళ్లు కూర్చుని ఏవో మాటల్లో మునిగిపోయారు. వారి దగ్గరకు వెళ్లిన రైతు, తమ గ్రామానికి చెందిన మహిళ పాము కాటుకు గురైందని, వచ్చి చూడాలని ప్రాధేయపడ్డాడు.
‘ఏం పాము కరిచింది..? ఎక్కడ కాటు వేసింది..? ఏ ఊరు..? ఏ మండలం..? ఓపీ రాయించుకుని వచ్చారా..? అంటూ.. డాక్టర్లు కనీసం కుర్చీలో నుంచి లేవకుండా.. బాధితురాలిని పరిశీలించకుండా పేషెంట్‌ను తీసుకెళ్లిన వ్యక్తిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తక్షణమే ఓపీ వార్డుకు వెళ్లగా జనం బారులు తీరి పావుగంట సమయం గడిచింది. తిరిగి క్యాజువాలిటీ వద్దకు వచ్చిన వారిని టెస్ట్‌లు చేయించుకుని రావాలంటూ మరో ఆర్డర్ వేశారు. పేషెంట్‌ను చూడకుండా టెస్ట్ ఏంటి అని అడిగితే, ఫలానా నెంబర్ గదికి వెళ్తే వాళ్లే చేస్తారు వెళ్లండి..! అంటూ ఆదేశించారు. ప్రాణభయంతో కొట్టుకుంటున్న మహిళను తీసుకుని రక్తపరీక్షల కేంద్రానికి వెళ్లి వచ్చేసరిగి మరో అర్ధగంట పట్టింది. ఇప్పుడన్నా వచ్చి చూడండి మేడం అని వైద్యులను కోరగా ఎలాంటి స్పందనా లేదు. చేతుల్లోని సెల్ఫోన్లను చూస్తూ ముగ్గురూ ముచ్చట్లోకి దిగారు. ఒకరిమీద మరొకరు జోకులు వేసుకుంటూ పగలబడి నవ్వుకుంటున్నరు. ఒక్కసారి రండి మేడం అని వ్యక్తి కోరగా.. ఆగవయ్యా బాబూ, ఇవన్నీ మాకు సర్వసాధారణమే, రోజూ కొన్ని వందల కేసులు చూస్తున్నామంటూ నిర్లక్ష్యపు సమాధానం.
ప్రాధేయపడినా పాముకాటు బాధితురాలిని పట్టించుకోని వైద్యుల అలసత్వంపై వెంకటగిరి క్రాస్‌రోడ్డుకు చెందిన రైతు తీవ్ర అసహనం వ్యక్తంచేశాడు. ఇదేంటి మేడం.. మనిషి చనిపోతున్నా స్పందించరా అని ప్రశ్నించాడు. ప్రభుత్వం లక్షల్లో జీతాలు ఇస్తున్నది ప్రజలకు వైద్యసేవలు అందించడానికి కాదా..? అంటూ నిలదీశాడు. దీనికే ఆగ్రహించిన వైద్యులు.. అరుస్తున్నావ్ ఎందుకు..? మాకు తెలియదా..? ఆమెకు ఏమీ కాదులే..? అంటూ ఒక మహిళా డాక్టర్ తీరిగ్గా కుర్చీలో నుంచి లేచి పేషెంట్ దగ్గరకు వచ్చారు. నాడీ కూడా పట్టకుండానే ఇంజక్షన్ ఇవ్వండి అంటూ పక్కనే ఉన్న నర్సుకు చెప్పి తిరిగి గదిలోకి వెళ్లిపోయింది.
వైద్యుల అలసత్వంతో విసిగిపోయిన ఓ వ్యక్తి అక్కడ జరుగుతున్న తీరును ఎవరికీ తెలియకుండానే వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా శనివారం ఉదయాన్నే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో సదరు వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ముగ్గురు కీలక మంత్రులున్న ఖమ్మంలో నిరుపేద ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలాగనే మారిందని కొందరు.. కాంగ్రెస్ పాలనలో గిట్లనే ఉంటదని మరికొందరు నెటిజన్లు తిట్టి పోస్తున్నరు. నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా రెండురోజుల వైద్యం అనంతరం పాముకాటుకు గురైన మహిళను పెద్దాసుపత్రి వైద్యులు ఇంటికి పంపించారు.
జిల్లా సార్వజనీన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రస్తుతం ఓపీ విపరీతంగా పెరిగింది. అయినప్పటికీ ఎంతో జాగ్రత్తగా వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం సరికాదు.
– డాక్టర్ కిరణ్‌కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్