ఖమ్మం రూరల్, ఏప్రిల్ 12 : పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తితో మనమంతా మొక్కలు నాటి సంరక్షించాలని, ఇదే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగూడెం గ్రామంలో రామయ్య పార్థివ దేహాన్ని మంత్రి సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వనజీవి రామయ్య ప్రకృతి ప్రేమికుడిగా దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించారన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించిందని తెలిపారు.
వనజీవి రామయ్య వృక్షో రక్షతి రక్షితః అంటూ జీవితాంతం మొక్కల పెంపకంతో గడిపారని, మొక్కలు పెంచితే మానవ సమాజానికి మంచిదని, పచ్చదనం ఉంటేనే మనుషులు బతుకుతారని నమ్మే రామయ్య చదువు లేకపోయినా, చిన్న కుటుంబం ఐనా మొక్కలు పెంచడం కోసం జీవితాన్ని అర్పించారని మంత్రి కొనియాడారు. సామాన్యులు మంచి పని సంకల్పం చేసుకుని చేస్తే ఏ స్థాయికి వెళ్తారో చెప్పేందుకు రామయ్య ఉదాహరణ అన్నారు.
వనజీవి రామయ్య స్ఫూర్తితో మనమంతా ఆయన గుర్తుగా తలా ఒక మొక్క నాటి సంరక్షించాలని, అప్పుడే రామయ్య ఆత్మ శాంతిస్తుందన్నారు. వనజీవి రామయ్య స్ఫూర్తి మనమందరం కొనసాగించాలని, ప్రజలకు ఉపయోగపడే పండ్ల మొక్కలు ఐనా ప్రతి ఒక్కరూ పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, రూరల్ తాసీల్దార్ రాం ప్రసాద్, ప్రజా ప్రతినిధులు, నగర కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.