కూసుమంచి, మే 20: ఖమ్మంతోపాటు సూర్యాపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. అంతకుమునుపు డెడ్ స్టోరేజీకి చేరిన పాలేరు నీటిమట్టం.. ఏప్రిల్ 8 వరకు సాగర్ నుంచి నీటిని వదలడంతో 19 అడుగులకు పెరిగింది అప్పటి నుంచి ప్రతి రోజూ మిషన్ భగరథకు మాత్రమే తాగునీరు అందిస్తున్నారు. క్రమంగా నీటిమట్టం తగ్గుతూ సోమవారం నాటికి 13.5 అడుగులకు చేరుకుంది. పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు. నిల్వ సామర్థ్యం 2.558 టీఎంసీలు. అయితే ప్రస్తుతం పాలేరులో 1.212 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. రోజుకు మిషన్ భగీరథ ద్వారా 135.45 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. మరో 15 రోజుల తరువాత మళ్లీ పాలేరు డెడ్ స్టోరీజీకి చేరనుంది అయితే కృష్ణా రివర్ బోర్డు తెలంగాణకు తాగునీటి వాటా కేటాయించడంతో మళ్లీ నాగార్జున సాగర్ నుంచి జూన్ మొదటి వారంలో తాగునీటి అవసరాల కోసం నీటిని పాలేరు వదిలే అవకాశం ఉంది. కాగా, రిజర్వాయర్ ప్రాంతంలో నీటి చోరీ జరుగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. లిఫ్టులకు విద్యుత్ సరఫరాను తొలగించి సాగర్ నుంచి పాలేరు వరకు ఎక్కడా ఎత్తిపోతల పని చేయకుండా జాగ్రత్తలు చేపట్టారు.