ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 01 : ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామం నుంచి పోలిశెట్టి గూడెం మద్దివారిగూడెంకు వెళ్లే ప్రధాన రహదారి డాక్యా తండా వద్ద పూర్తిగా దెబ్బతింది. గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గుంటలుగా మారి వరద నీరు వచ్చి చేరడంతో బురదమయంగా మారింది. చిన్నపాటి వర్షం వస్తే చిన్నపిల్లలు వృద్ధులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అదే రహదారి గుండా ప్రయాణం చేసే రెండు గ్రామాల ప్రజలు సైతం నానాయాతన పడుతున్నారు.
ఖమ్మం రూరల్ మండలం అధికార పార్టీకి చెందిన మండలాధ్యక్షుడి గ్రామంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం గ్రామ రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా తయారవడంతో తీవ్ర ఆగ్రహం చెందిన స్థానిక గిరిజన మహిళలు ఏకంగా ప్రధాన రహదారిపై వరి నాట్లు వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు రహదారి పునర్నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు.
Khammam Rural : బురద గుంటల రోడ్డుపై వరి నాట్లతో గిరిజన మహిళల నిరసన