కారేపల్లి, ఆగస్టు 01 : కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమస్యలపై శుక్రవారం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు పాఠశాల ఎదుట అందోళన నిర్వహించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా గిరిజన సంఘం మండల అధ్యక్షుడు అజ్మీర శోభన్‌నాయక్ మాట్లాడుతూ.. బాజుమల్లాయిగూడెం పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పాఠశాల అవరణం అసాంఘిక శక్తులకు అడ్డగా మారిందన్నారు. పాఠశాలలో టీవీ వంటి ఖరీదైన వస్తువులు మాయమవుతున్నాయన్నారు. విద్యుత్ సౌకర్యం లేక రాత్రుళ్లు ఆకతాయిలు అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.
నాలుగు దశాబ్ధాల చరిత్ర ఉన్న ఈ పాఠశాల శిథిలావస్ధకు చేరుకున్న కారణంగా పునర్మించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో విద్య, వైద్యం పట్ల పాలకులు చూపుతున్న వివక్షతకు ఈ పాఠశాలే నిదర్శమన్నారు. తక్షణమే పాఠశాలకు రక్షణ గోడ నిర్మించాలని, తరగతి గదుల నిర్మాణం చేయాలని, వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల సమస్యలపై కలెక్టర్, డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం సోషల్ మీడియా కన్వీనర్ దారావత్ వినోద్‌కుమార్, డీవైఎఫ్ఐ నాయకులు ధారావత్ రవికుమార్, భూక్య మల్సూర్ నాయక్ పాల్గొన్నారు.