బోనకల్లు, ఆగస్టు 26 : ప్రపంచ మానవాళి మనుగడకు చెట్లే జీవనాధారమని మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.మధు అన్నారు. బోనకల్లు మండలంలోని ముష్టికుంట్ల పురమ్మతల్లి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సంగాపు దుర్గాప్రసాద్ సహకారంతో రూ.25 వేల వ్యయంతో 50 పనస మొక్కలను నాటే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ హాజరై స్థానిక ఎస్ఐ పొదిలి వెంకన్నతో కలిసి పనస మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రజలందరీ బాధ్యత అన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, రేపటి తరాలకు అందించాలన్నారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పచుకుని ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలన్నారు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగాపు దుర్గాప్రసాద్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సంగాపు తిరుపతయ్య, సంగాపు వెంకటనారాయణల జ్ఞాపకార్ధం సంగాపు దుర్గాప్రసాద్ రూ.50 వేల వ్యయంతో 25 బల్లలను గ్రామంలోని ప్రధాన కూడళ్లలో వితరణగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి షేక్ సైదులు, చిట్టంశెట్టి రాము, సంగాపు శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు బంధం శ్రీనివాసరావు, కందికొండ శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు చల్ది ప్రసాదరావు, సిపిఐ నాయకుడు బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.