మామిళ్లగూడెం, సెప్టెంబర్ 4: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగుస్తున్నందున ఈ నెల 6న విఘ్ననాథుడి విగ్రహాల నిమజ్జనం కోసం జిల్లాలో కట్టదిట్టుమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్‌దత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఖమ్మం నగరంలో ఈ నెల 6న ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు చెప్పారు.
ఖమ్మం నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలను నిర్వాహకులు ఆయా మండపాల నుంచి కాల్వొడ్డు, ప్రకాశ్నగర్లలోని మున్నేరులో నిమజ్జనానికి తీసుకెళ్లేందుకు తాము సూచించిన రూట్లలోనే ప్రయాణించాలని సూచించారు. వాహనదారులు కూడా శోభాయాత్ర జరిగే రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని సూచించారు.
ఖమ్మం సబ్ డివిజన్లో 700 విగ్రహాలు ఉన్నాయని, వాటిని తాము సూచించిన రెండు ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలని సూచించారు. శోభాయాత్రలో డీజేలు, లేజర్ కిరణాల వినియోగం నిషేధమన్నారు. వాహనాల డ్రైవర్లు మద్యం తాగవద్దని, మత్తు పానీయాలు తీసుకోవద్దని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావుతోపాటు 500 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రేపు బార్లు, మద్యం దుకాణాలు బంద్
గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జనం నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6 గంటలకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ పాటించాలని, మద్యం విక్రయాలు నిలిపివేయాలని సీపీ సునీల్‌దత్ గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు.