తరాలు మారినా తరగని వన్నెతో తారతమ్యం లేకుండా జరుపుకునే పండుగ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ వేడుక.. రక్తసంబంధానికి ప్రతిరూపం.. తోబుట్టువుల తియ్యటి జ్ఞాపకం.. రక్షాబంధన్. దీనినే రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. ఆప్యాయతలకు సాక్షిభూతమై అవనిపై అజేయంగా వర్ధిల్లుతున్న సంబురం. కొన్ని ప్రాంతాల్లో జంధ్యాల పౌర్ణమిగా పిలిచే ఈ పండుగ శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఈ పండుగను ఆగస్టు 19న సోమవారం జరుపుకుంటున్నారు.
– ఖమ్మం/ సారపాక/ కరకగూడెం, ఆగస్టు 18
అమ్మలోని ప్రేమను.. నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్. ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున తోడబుట్టిన అన్నాతమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కాచెల్లెళ్లంతా కోరుకుంటారు. ఈ సందర్భంగా సోదరుల నోరు తీపి చేసి సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తారు. ఇలా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల నడుమ అనురాగ బంధానికి రాఖీపండుగ వారథిలా నిలుస్తోంది.
రక్షాబంధన్‌పై పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా సోదరుల క్షేమాన్ని కాంక్షించి అక్కాచెల్లెళ్లు మహావిష్ణువును ధ్యానిస్తూ సోదరుల చేతికి రక్ష కట్టే సందర్భంగా చెబుతారు. అందుకే ఈ పండుగను రక్షాబంధనం అంటారు. దీన్ని శ్రావణ పౌర్ణమి రోజున తోడబుట్టిన వాళ్లు తన సోదరులకు రాఖీ కట్టి తమ పేగుబంధాన్ని చాటుకుంటారు. బలి చక్రవర్తితో జరిగిన యుద్ధంలో ఓడిపోయిన ఇంద్రుడు తన సర్వాధిపత్యాన్ని కోల్పోతాడు. పూర్వవైభవం కోసం విష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకునేందుకు సిద్ధమవుతాడు.
ఆ తరుణంలో భరత విజయాన్ని కాంక్షిస్తూ ఇంద్రుడి భార్య శచీదేవి ఆదిపరాశక్తిని స్మరిస్తూ కంకణం కడుతుంది. ఇది తొలి రాఖీ అని పురాణాల్లో చెబుతుంటారు. నిజానికి రక్షాబంధన్ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన పండుగ. అప్పట్లో రాజపుత్రులు ఎక్కువగా ఈ వేడుక జరుపుకునేవారని చెబుతారు. రాజపుత్ర రాజైన పురుషోత్తముడు అలెగ్జాండర్‌తో జరిగిన యుద్ధంలో ఓడిపోవడానికి ఈ రక్షాబంధనమే కారణమంటారు. అలెగ్జాండర్ భార్య రొక్సానా పురుషోత్తముడికి రాఖీ కట్టి తనకు పతిభిక్ష పెట్టమని వేడుకున్నందునే కావాలని ఓడిపోయాడనేది కొందరి కథనం.
యేనాబద్దో బలిరాజా.. దానవేంద్రో మహాబలం.. తేనేత్వ మబిబద్నామి రక్షే మాచల.. అంటే ఓ రక్షాబంధమా.. మహా బలవంతుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను అని పురాణ కవుల నుంచి వినిపిస్తోంది. మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు అతడితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. మహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధనానికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది. ధర్మరాజు రక్షాబంధనం గురించి అడగ్గా శ్రీకృష్ణుడు ఈ గాథను వివరించినట్లు పురాణాల్లో ఉంది.
రాఖీబంధం కేవలం సోదర, సోదరీమణుల మధ్యే కాకుండా మానవీయతతో కూడిన కరుణాంతరంగ వేడుకగా జరుపుకోవాలి. ఇదే విషయాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ఠాగూర్ పిలుపునిచ్చారు. మన దేశంలోని హిందువులు, ముస్లింల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి రక్షాబంధన్ ఉత్సవాన్ని వేడుకగా చేసుకోవడంతో ఇది అంతర్జాతీయంగా గుర్తింపులోకి వచ్చింది.
శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజు యజ్ఞోపధారణ చేసుకుంటారు. బ్రాహ్మణ, వైశ్య, పద్మశాలి, విశ్వబ్రాహ్మణులు తదితర సామాజిక వర్గాలు యజ్ఞోపవీతాలు మార్చుకుంటారు. పాతవాటి స్థానాల్లో కొత్త వాటిని ధరిస్తారు. పద్మశాలీలు ఉదయమే జంధ్యాలు మార్చుకుని సాయంత్రం మార్కండేయస్వామికి పూజలు చేసి కొన్ని ప్రాంతాల్లో రథోత్సవాన్ని నిర్వహిస్తారు.
రాఖీ పండుగ వచ్చిందంటే చిన్నప్పటి మధర జ్ఞాపకాలు కళ్లముందే కదలాడుతాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకూ మా అన్నయ్యకు, తమ్ముడికి రాఖీ కడుతూనే ఉన్నాను. నా సోదరులు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని, నాకు రక్షణగా ఉండాలని ఆ దేవుడిని పూజిస్తాను. రాఖీ పండుగ రోజు మా సోదరులతో ఆ రోజంతా సంతోషంగా గడుపుతాను. వారికి రాఖీ కట్టి స్వీట్లు తినిపించి ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం విడదీయలేని బంధం. అది చాటి చెప్పే వేడుకే ఈ రాఖీ పండుగ.
-రేగా దివ్య, కరకగూడెం మండలం
ఖమ్మం, ఆగస్టు 18: ఖమ్మం జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజల ప్రేమకు రాఖీ పండుగకు ప్రతిరూపంగా నిలుస్తుందని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళల కోసం బతుకమ్మ చీరెలు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశారని గుర్తుచేశారు.