కర్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. “తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం కింద మీ ఖాతాల్లో నగదు జమ చేస్తున్నది. ఈ సాయం పెట్టుబడి, వ్యవసాయ పనులకు ఉపయోగపడుతున్నదని ఆశిస్తున్నా” అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేరిట ఫోన్‌కు మెసేజ్‌లు వస్తుండడంతో అన్నదాతలు సంబురపడుతున్నారు. యాసంగి సాగుకు ముందే పంట పెట్టుబడి సాయం చేతికి అందడంతో రైతులు ఉత్సాహంగా సాగులోకి దిగుతున్నారు. కాగా, గురువారం కారేపల్లి మండలం బీక్యాతండాలో రైతులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్న కేసీఆర్‌కు రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లాలో యాసంగి రైతుబంధు సాయం రూ.204.51 కోట్లు మంజూరు కాగా.. 1,34,370 మంది రైతులు సాయం అందుకోనున్నారు. ఖమ్మం జిల్లాలో 3,28,491 మంది రైతులకు రూ.363.44 కోట్లు జమకానున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ) : వానకాలం పంట ఉత్పత్తులను అమ్ముకుని యాసంగికి సాగు సిద్ధమవుతున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వ అండగా నిలిచింది. యాసంగి సాగు సాగుకు ముందే పెట్టుబడి అందిస్తుండడంతో సన్న, చిన్నకారు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో మొత్తం 1,34,370 మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను ఆన్లైన్ చేశారు. దీంతో తొలిరోజు 30,905 మంది రైతులకు రూ.10.67 లక్షల సొమ్ము జమ అయ్యింది. రెండోరోజు గురువారం జిల్లా వ్యాప్తంగా 86,127 మంది రైతులకు రూ.64.04 కోట్లు వారి ఖాతాలో జమ అయ్యింది. రైతుబంధు సాయం అందడంతో కర్షకులు ఆనందంగా సాగులోకి దిగుతున్నారు. ఇప్పటికే వరి ధాన్యాన్ని పంట కల్లాల్లో వేసి విక్రయిస్తున్న రైతులు యాసంగికి పొలాలను సిద్ధం చేస్తున్నారు.
అశ్వారావుపేట టౌన్, డిసెంబర్ 29 : పెట్టుబడి సాయం సొమ్ము రైతుల ఖాతాలో జమ అవుతుండటంతో సంబురపడుతున్నారు. తొలిరోజు ఎకరంలోపు ఉన్నవారికి సొమ్ము జమ అయ్యింది. రెండోరోజు రెండు ఎకరాలలోపు ఉన్న రైతులుకు ఎకరానికి రూ.5 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసింది. రైతుబంధు నగదుతో పంటకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తామని అశ్వారావుపేట రైతులు నక్కా రాంబాబు, చిన్నంశెట్టి సోమేశ్వరావు, పసుపులేటి శేఖర్, ఇళ్ళశేఖర్, చిన్నంశెట్టి శ్రీను తెలిపారు.

కారేపల్లి, డిసెంబర్ 29 : రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సాగుకు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయడాన్ని హర్షిస్తూ గురువారం అప్పాయిగూడెం గ్రామపంచాయతీ బీక్యాతండా సమీపంలోని పంట చేలలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబాంధవుడని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీరా అరుణ, ఉపసర్పంచ్ భూక్యా రాజేష్, బీఆర్ఎస్ మండల మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీరా వీరన్న, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు వాంకుడోత్ కరణ్‌సింగ్, రైతులు లక్ష్మణ్ నాయక్, వాంకుడోత్ విజయ్, గుగులోత్ లక్క, బావ్‌సింగ్, దేవీలాల్, కిరణ్, నగేష్, తోటమల్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అన్నివిధాలా అండగా ఉండేది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నది. సీఎం కేసీఆర్ అడగకుండానే రైతుబంధు సాయం అందించి ఆదుకున్నారు. కర్షకులకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి మా మద్దతు ఇస్తాం.
-మరకాల కిశోర్‌రెడ్డి, యువరైతు
కాయకష్టం తెలిసిన వ్యక్తి సీఎం కావడంతోనే కేసీఆర్ ప్రభుత్వంలో అప్పులేని వ్యవసాయం చేస్తున్నాం. గతంలో పంట పెట్టుబడికి ఎక్కడో ఓచోట అధిక వడ్డీలకు సైతం అప్పు తెచ్చి సాగు చేసేటోళ్లం.. లేదా క్రాప్‌లోన్ పెట్టుకుని వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడిని తెచ్చుకునేటోళ్లం. ఇప్పుడైతే ఆ భయం లేదు. ప్రతి ఏడాది రైతుబంధు పథకం ఆదుకుంటున్నది. ఎవుసానికి కావాల్సిన పెట్టుబడికి కేసీఆర్ డబ్బులు మా బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. ఇంకేంకావాలి.
-మంకిన ధర్మారావు, అశ్వారావుపేట రైతు
తెలంగాణ ప్రభుత్వం ఏటా వానకాలం, యాసంగి సాగుకు రెండు దఫాలుగా పంట పెట్టుబడి సాయం(రైతుబంధు) అందిస్తున్నది. ఇప్పటికే యాసంగి సాగుకు పంట పెట్టుబడి సాయం బ్యాంకుఖాతాలో జమ అయ్యింది. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ పథకం రైతులకు వరంగా మారింది. దండుగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేశారు. గతంలో పెట్టుబడికి అప్పు తెచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతుబంధుతో పెట్టుబడి రంది తీరింది.
– యనగంటి వెంకటేశ్వరరావు, రైతు
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు పథకం రైతులకు వరంగా మారింది. గతంలో సమయానికి పెట్టుబడులు లేక, అప్పులు తెచ్చుకోలేక, తెచ్చినా వాటికి అధిక వడ్డీలు కట్టలేక అరిగోస పడేవాళ్లం. కానీ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన రైతుబంధు పథకం వ్యవసాయం పండుగలా మారింది. వ్యవసాయాన్ని ఎలా తీర్చిదిద్దాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించాడు. ఈ ఏడాది యాసంగి సాగు కోసం రైతుబంధు సాయం నా బ్యాంకు ఖాతాలో ఈ రోజే జమ అయింది. 2018 నుంచి నాకు రెండు సీజన్లలోనూ పంటల పెట్టుబడి సాయం అందుతోంది. ఈ సాయంతోనే పనులు మొదలుపెడుతున్నా.
-బీ.నారాయణ, రైతు, ఎంపీ బంజర, భద్రాద్రి