భద్రాచలం, డిసెంబర్ 28: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఆరో రోజు భద్రాద్రి రామయ్య పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీమన్నారాయణుడు జమదగ్ని అనే మహర్షికి కుమారుడిగా జన్మించి, పరశురాముడిగా పిలువబడుతూ దుర్మార్గులైన రాజులను, దుష్టుడైన కార్తవీర్యార్జునుడిని తన ఆయుధమైన గొడ్డలితో సంహరిస్తాడు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయన్న పురాణోక్తి. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీకృష్ణ పరమాత్మను, ఆండాళ్తల్లిని, సీతారామ లక్ష్మణమూర్తులను బేడా మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ద్రావిడ పాశురాలను విన్నవించారు.
యాగవీరమూర్తులకు పరశురామావతారాన్ని అలంకరించారు. ఈ అవతారంలో స్వామిని భక్తులందరూ కనులారా దర్శించుకొని తన్మయత్వం చెందారు. దేవస్థానం ఈవో శివాజీ, ఏఈవోలు శ్రావణ్‌కుమార్, రామకృష్ణ, ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, పొడిచేటి సీతారామానుజాచార్యులు పాల్గొన్నారు.
నేడు శ్రీరామావతారం..
లోక కంఠకులైన రావణ, కుంభకర్ణాది రాక్షసులను సంహరించడానికి దశరథుడి కుమారుడిగా శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారమే శ్రీరామావతారం. వ్యక్తిగత సౌఖ్యాలకన్నా ధర్మాచరణమే ఉత్తమైనదని, అదే శాశ్వతమైనదని నిరూపించి పరిపూర్ణుడైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు శ్రీరాముడు. మానవుడిగా జన్మించి పితృవాక్య పరిపాలకుడిగా 14 ఏళ్లు అరణ్యవాసం చేసి అయోధ్యను పాలించాడు. మర్యాద పురుషోత్తముడు, ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు.
ఆన్లైన్లో గదుల కేటాయింపు..
ప్రయుక్త అధ్యయనోత్సవాలను తిలకించేందుకు వచ్చే భక్తులు బస చేసేందుకు వీలుగా దేవస్థానం గదులను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునేందుకు బుధవారం నుంచి అవకాశం కల్పించినట్లు దేవస్థానం ఈవో శివాజీ తెలిపారు. https://book.bhadrachalamonline.com ద్వారా భక్తులు తమకు కావాల్సిన గదులను బుక్ చేసుకోవచ్చని చెప్పారు.