ఐదు నెలలుగా వేతనాలు అందని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితాలో తాజాగా మూడో ఏఎన్ఎంలు కూడా చేరారు. తమకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం వల్ల తమ కుటుంబాలు గడవడం లేదంటూ ఇటీవలే మిషన్ భగీరథ కార్మికులు ఆందోళన బాట పట్టిన విషయం విదితమే. ఇప్పుడు వారి తదుపరి జాబితాలో మూడో ఏఎన్ఎంలు కూడా చేరినట్లయింది. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భద్రాద్రి జిల్లాలోని ప్రాథమిక, అర్బన్ హెల్త్ సెంటర్లలో మొత్తం 39 మంది మూడో ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.27,200 చొప్పున అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం వేతనాలు విడుదల చేస్తోంది.
కానీ, గడిచిన ఐదు నెలలుగా వీరికి వేతనాలు విడుదల కావడం లేదు. దీంతో అప్పోసప్పో చేసి రెండు మూడు నెలలు కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చారు మూడో ఏఎన్ఎంలు. కానీ, మూడు నెలలు గడిచినా అరువు తీర్చకపోయే సరికి కిరాణా కొట్లోనూ వారికి సరుకులివ్వడం లేదు. దీంతో ఒక్కోసారి పస్తులతోనే సావాసం చేయాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. స్కూళ్ల యాజమాన్యాలు ఊరుకునే పరిస్థితి లేకపోవడంతో ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తాకట్టుపెట్టి మరీ పిల్లల ఫీజులు కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.
-భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి జిల్లాలోని మూడో ఏఎన్ఎంల బతుకులు దయనీయంగా ఉన్నాయి. ఏ నెలకు ఆ నెల వేతనం వస్తేనే కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉన్న చిరుద్యోగుల జీవితాల్లో నెలల తరబడి జీతాలు రాకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితులు తప్పడం లేదు. అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఐదు నెలలుగా చిరుద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలన్నీ ఆకలితో అల్లాడే పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే ఆశా కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, మిషన్ భగీరథ వర్కర్లు ‘వేతనాలు మహాప్రభో..’ అంటూ నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చినప్పుడు ఒకటో రెండో నెలల వేతనాలిచ్చి చేతులు దులుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తరువాత నెలల వేతనాలూ సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో ఆయా కార్మికులు మళ్లీ మళ్లీ ఆందోళనలకు దిగుతూనే ఉన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రులకు, ఆరోగ్య ఉప కేంద్రాలకు వెళ్లిన రోగులకు సమస్త సేవలూ అందిస్తూ వారి ఆరోగ్యం మెరుగయ్యేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న మూడో ఏఎన్ఎంలకు మాత్రం.. కన్నీటి గాథలే మిగులుతున్నాయి.
వృత్తిపై మమకారంతో ఎనలేని సేవలందిస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారిపై కనీస కనికరమూ చూపించడం లేదు. ‘నెలల తరబడి మాకు వేతనాలు రావడం లేదు సారూ..’ అంటూ ఇటీవల కలెక్టరేట్‌కు వచ్చి అదనపు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా వారి సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. ఏజెన్సీని మారుస్తామని, ప్రతినెలా వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా.. కలెక్టరేట్ నుంచి మాత్రం వారి ఫైల్ కదలలేదు. దీంతో వారి వేతనాల ఆలస్యం సమస్యకు పరిష్కారం లభించలేదు.
బంగారాన్ని తాకట్టు పెట్టి పిల్లల ఫీజు కట్టాను..
నేను కొత్తగూడెం జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఉన్న అర్బన్ ఆరోగ్య కేంద్రంలో మూడో ఏఎన్ఎంగా అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నాను. మాకు ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదు. స్కూలు వాళ్ల ఫోన్లు తట్టుకోలేక ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టుపెట్టి పిల్లల ఫీజు కట్టాను. మిగిలిన నగదుతో సంసారాన్ని వెళ్లదీసుకుంటున్నాను. నెలల తరబడి బాకీ తీర్చని కారణంగా కిరాణా కొట్లోనూ అరువు ఇవ్వడం లేదు.
-విజయలక్ష్మి, మూడో ఏఎన్ఎం, యూహెచ్‌సీ, కొత్తగూడెం
అప్పు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం..
పేరుకే మాది తెల్లటి యూనిఫాం. బయటకు కన్పించినంత స్వచ్ఛంగా మా బతుకులు లేవు. అంతా చీకటిమయమే. ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు రాకపోవడం వల్ల మేం లోలోపల అనుభవించే బాధలు అన్నీఇన్నీ కావు. కానీ, ఈ ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకోవడం లేదు. సక్రమంగా వేతనాలూ ఇవ్వడం లేదు. అప్పు చేసి మరీ కుటుంబాలను పోషించుకుంటున్నాం. వేతనం వచ్చేదాకా కట్టకపోవడంతో అప్పుల వాళ్లు పీక్కుతింటున్నారు.
-ఆర్.రాణి. మూడో ఏఎన్ఎం, భద్రాచలం
బడ్జెజ్ ఉంది.. ఏజెన్సీ అప్రూవల్ కాలేదు..
తమకు జీతాలు రావడం లేదంటూ మూడో ఏఎన్ఎంలకు ఇటీవలే వినతిపత్రాన్ని ఇచ్చారు. వారి వేతనాలకు బడ్జెట్ కూడా ఉంది. కానీ, వారి వేతనాలు చెల్లించాల్సిన ఏజెన్సీ ఏప్రిల్ నెలలోనే రెన్యూవల్ కావాల్సి ఉంది. రెన్యూవల్ కాని కారణంగా ఆ ఏజెన్సీ రద్దయింది. ఇప్పుడు కొత్త ఏజెన్సీకి అనుమతి రాగానే మూడో ఏఎన్ఎంల వేతనాలు జమ చేస్తాం. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది.
-డాక్టర్ జయలక్ష్మి, డీఎంహెచ్‌వో, భద్రాద్రి కొత్తగూడెం