ఖమ్మం: బాలకార్మికులు లేని సమాజం నిర్మించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా సహాయ కార్మికశాఖ అధికారి పీవీకే శాస్త్రి తెలిపారు. శనివారం నగరంలోని వర్తకసంఘం కార్యాలయంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కార్మికశాఖ అధికారి పీవీకే శాస్త్రి మాట్లాడుతూ సుస్థిర అభివృద్ది లక్ష్యాల సాధనకు సమసమాజ స్థాపనకు బాలకార్మిక వ్యవస్థ అడ్డుపడుతుందన్నారు. ఈ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు గాను ప్రతి సంవత్సరం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా బాల కార్మికులను గుర్తించి తిరిగి బడుల్లో చేర్పించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్మికశాఖ, ఐసీడీఎస్, ఇతర అనుబంధ సంస్థల పనితీరుతో బాలకార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. కార్మికశాఖ ద్వార ఎప్పటికప్పుడు బాలకార్మిక చట్టాలపై వివిధ రూపాలలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. బాల కార్మికులకు ఏ విధమైన ఆపద వచ్చిన చైల్డ్‌లైన్-1098కు కానీ కార్మికశాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, చైల్డ్‌లైన్ సమన్వయకర్త శ్రీనివాస్, వరక్తసంఘం నాయకులు తూములూరి లక్ష్మినర్సింహరావు, బందు సూర్యం, గెల్లా రవి, తదితరులు పాల్గొన్నారు.