రఘునాథపాలెం, మే19 : జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ సేవలను పటిష్టం చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని హనుమకొండ డీటీసీ పీ పురుషోత్తం జిల్లా రవాణాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఖమ్మంజిల్లా ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఆఫీస్ రిజిస్టర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇన్చార్జి డీటీవో వెంకటరమణ, ఎంవీఐలతో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని పటిష్టం చేసి ప్రతి నెల టార్గెట్‌ను సాధించేలా సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచేవిధంగా పని చేయాలని ఆదేశించారు. పన్నులు చెల్లించకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై దృష్టి సారించి బకాయిలను వసూలు చేయడం, వాహన తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు.
పలు కారణాలతో పట్టుబడి సీజ్ చేయబడిన రవాణాశాఖ ద్వారా వచ్చిన వాహనాలు ఎన్ని ఉన్నాయి.. పోలీస్‌శాఖ ద్వారా పట్టుబడిన వాహనాలు కార్యాలయంలో ఎన్నెన్ని ఉన్నాయో నివేదికను తయారు చేయాలన్నారు. రవాణాశాఖ సీజ్ చేయబడినా విడిపించుకోని వాహనాలను వేలం వేయడం జరుగుతుందని డీటీసీ తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరానికి గానూ ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు ఫిట్‌నెస్‌కు వచ్చే క్రమంలో ముందస్తుగా యాజమాన్యాలతో అవగాహన సదస్సు నిర్వహించి సూచనలు చేయాలని ఆదేశించారు. అనంతరం ఉద్యోగులతో మాట్లాడి కార్యాలయంలో వారి సమస్యలపై ఆరా తీశారు. ఏఎంవీఐ స్వర్ణలత, ఇన్చార్జి ఏవో సుధాకర్ పాల్గొన్నారు.