‘ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూగేనా.. ఊరంత జాతరయ్యి సంబూరమాడేనా.. గుండెల్లో తలపులు గువ్వల్లే ఎగిరేనా.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు భూముల్లో ఉయ్యాలో బతుకమ్మ పుట్టింది ఉయ్యాలో..’ అని ఓ వాగ్గేయకారుడు బతుకమ్మ పండుగ సంబురాన్ని ఎలుగెత్తి చాటాడు.. తెలంగాణ అంటే గుర్తొచ్చే ఏకైక పండుగ బతుకమ్మ.. ఇది ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పండుగ రానే వచ్చింది.. శనివారం ఎంగిలి పూల బతుకమ్మతో మొదలయ్యే వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సంబురాలకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. స్వచ్ఛమైన ప్రకృతి పండుగను ఎదలకు హత్తుకోనున్నారు.. పసిరికలూ పూలు.. చెట్టూ చేమ.. చెరువూ పొలాన్ని కొలువనున్నారు..
– భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/
భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం /ఖమ్మంరూరల్, అక్టోబర్ 13 : పూలజాతరకు ఆడబిడ్డలు సిద్ధయ్యారు. ఖమ్మం ఉమ్మడిజిల్లా నేటినుంచి పూలసింగిడితో సందడి చేయనున్నది. తీరొక్కపూలతో మహిళలు ఆడి పాడనున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక బతుకమ్మ సంబురానికి మరింత ఆదరణ పెరగడంతో పూలజాతర మిన్నంటుతున్నది. దేవుడికి సమర్పిస్తారు కాబట్టి పూలకు ప్రత్యేకత ఉంటుంది. ఈ పూలపండుగ పదిరోజులు జరుగుతుంది. ప్రతి ఇంట బతుకమ్మలతో తొమ్మిదిరోజులు ఆడిపాడి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి దసరా ఉత్సవంతో ముగిస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు ఇవ్వడంతో రంగురంగుల చీరెలు కట్టుకొని బతుకమ్మ ఆడుకోవడానికి మహిళలు సిద్ధమయ్యారు. పాఠశాలలకు సైతం దసరా సెలవలు ఇవ్వడంతో పిల్లలు కూడా రెడీగా ఉన్నారు.
తెలంగాణ రాక ముందు పూలపండుగకు అంతగా ఆదరణ లేదు. తెలంగాణ ఏర్పాటుతో ఎంపీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకతను తెచ్చారు. విదేశాల్లో సైతం బతుకమ్మ పండుగలు జరుపుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పూలకు మంచి గిరాకీ పెరగడంతోపాటు దానిపై ఆధారపడుతున్న వ్యాపారులకు కూడా ఉపాధి పెరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చి ఆడుకోనున్నారు. పూజకు ఉపయోగించే పూలకూ ఒక పండుగ ఉండడంతోపాటు పూలను పూజించే విధానం బతుకమ్మ పండుగకు ప్రత్యేకంగా మారింది.
తొమ్మిదిరోజులపాటు జిల్లాఅంతటా సందడిగా మారనున్నది. ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, విద్యార్థులు కొత్తకొత్త పాటలతో ఆడనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ వేడుకలను జరిపించడానికి ఘాట్లను ఏర్పాటు చేస్తున్నది. స్థానికంగా ఉన్న వాగులు, చెరువులు వద్ద ఘాట్లను అందుబాటులో ఉంచి నిమజ్జనాలకు సిద్ధంగా ఉంచనున్నది. ఇందుకోసం బతుకమ్మ ఉత్సవ సమితిని కూడా ఏర్పాటు చేయనున్నది.
ప్రతి పుష్పానికి ఔషధ గుణం ఉంటుంది. ప్రకృతి ఒడిలో పుట్టిన ప్రతి చెట్టుకు ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయో వాటికి పూచిన పుష్పాలకు కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే అవి పూజకు నోచుకున్నాయి. పూజకు పనికిరాని పువ్వులు కూడా ఉన్నాయి. వాటికి వీటికి ఎంతో తేడా ఉంటుంది. పూజలో ఉపయోగించే ప్రతి పుష్పం ఆరోగ్యానికి మేలు చేసేదే. కాని వాటి విలువ గతంలో చాలామందికి తెలియలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక మన పూలకు ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పడంతో వాటి విలువ ఇప్పుడు అందరికీ తెలుస్తున్నది.
తండేగు పూలు.. దీని శాస్త్రీయనామం కేషియా అరికేటా. ఇవి మన సంప్రదాయ బతుకమ్మకు ఆకర్షణీయ రంగులు, సొబగులుగా ఉంటాయి. ఈ పూలు నీటిని శుద్ధి చేస్తాయి. అన్ని రకాలుగా ఆరోగ్య ప్రదాయం. బతుకమ్మ సంబురాల్లో ఇవే ప్రత్యేకపాత్ర పోషిస్తాయి. ఇది రాష్ట్ర పుష్పంగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు తంగేడు పూలను పెద్దగా పట్టించుకునే వారు కారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పూల గురించి, వాటి ప్రాముఖ్యత తెలిసింది. ఇప్పుడు తంగేడు చెట్టును ప్రతి ఇంటి పెరడులో నాటుతున్నారు.
గునుగు పూలను సెలోషియా అర్జెంటినా అనే శాస్త్రీయనామంతో పిలుస్తారు. బతుకమ్మ పండుగ నాడు మాత్రమే ఈ పూలకు డిమాండ్ ఉంటుంది. బతుకమ్మకు తప్పకుండా ఈ పూలు పెట్టాల్సిందే. చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. నీటిలో కలిసినా ఎలాంటి దుష్పభావం ఉండదు. ఆరోగ్యానికి చాలా మంచిది.
దీనిని లూఫా ఎక్యుట్ ఆంగ్లా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఈ తీగ కూరజాతిది. బీరకాయలు ఈ సీజన్లో ఎక్కువగా కాస్తాయి. ఈ కూరగాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. జ్వరం వచ్చిన రోగికి పత్తెం చేయడానికి ఈ కూరను ముందుగా తినమంటారు. శాఖాహారంలో ఈ కూరతోపాటు చెట్నీ కూడా చేసుకుంటారు. బీర పూలను కేవలం బతుకమ్మ పండుగ నాడు పూల మధ్యన పేర్చుతారు. చెరువులో కలిపినా నీరు కలుషితం కాదు.
గుమ్మడి కుకుర్ బీటా మాగ్జిమా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. మన సంప్రదాయ బతుకమ్మకు ఎంతో అందాన్ని తెస్తాయి. వీటిని బతుకమ్మ పేర్చిన తరువాత అలంకరించడానికి ఎంతో ఉపయోగిస్తారు. గుమ్మడి అనేది ఔషధ గుణం కలకాయలు. సర్వరోగ నివారిణిగా ఈ కాయలను వాడతారు. సాంబారుతోపాటు కూర కూడా వండుకోవచ్చు. గుమ్మడిలో చాలా రకాలు ఉన్నాయి. బూడిదగుమ్మడి పూలు మాత్రమే బతుకమ్మ పూల మధ్యలో వాడతారు.
దీనిని టాజిటాస్ ఎరెక్టా అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఎంతో ఆకర్షణీయంగా ఈ పూలు ఉంటాయి. వివిధరకాల రంగుల్లో దొరుకుతాయి. ప్రతిఒక్కరికీ ఎంతో ఇష్టం. బతుకమ్మను పేర్చేటప్పుడు ఈ పూలు ఎంతో అందానిస్తాయి. బంతిపూలుకు తెలంగాణలో బతుకమ్మకు ఎంత విశిష్టత ఉందో ఆ పూలకు కూడా అంతే విశిష్టత ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక పూలసందడి ప్రారంభమైంది. ప్రతి ఇంట అందమైన పూదోట పూయిస్తున్నారు. చాలామంది ఈ పూలతో వ్యాపారం చూసి ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఉద్యానవనశాఖ బంతిపూల తోటలకు ప్రోత్సాహం కల్పించింది. బంతి ఆకు రసం గాయాలైనప్పుడు వెంటనే ఆకురసం రాస్తే రక్తస్రావం వెంటనే ఆగిపోతుంది. గాయం కూడా మానుతుంది.