ఖమ్మం బుక్ ఫెయిర్లో ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు
పోటీ పరీక్షార్థుల కోసం ఎన్నో సాహిత్య పుస్తకాలు
ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 7: ప్రాంతమంటే ప్రత్యేక జీవన విధానం, భిన్నమైన సామాజిక, సాహిత్య, సాంస్కృతిక నేపథ్యమే ఉండడమే. స్వరాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించాక అస్తిత్వాన్ని కోల్పోయిన అకాడమీలకు ‘తెలంగాణ సాహిత్య అకాడమీ’ ద్వారానే సరికొత్త ఆకృతి వచ్చింది. సాహిత్యాన్ని చదువుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అనర్గళంగా బతృహరి సుభాషితాలను టీకాతాత్పర్యాన్ని చెప్పగలను. సామల సదాశివ, గూడూరి సీతారాం, కాళోజీ, దాశరథి, వట్టికోట, సినారె, పీవీ చారి వంటి వారి గురించైనా సునాయసంగా మాట్లాడగలరు. అలాంటి సాహిత్య ప్రియుల దార్శనికుడైన వాచస్పతి కలల రూపం తెలంగాణ సాహిత్య అకాడమీ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరుగునపడిన ప్రాంతీయ సాహిత్యాన్ని స్వరాష్ట్రం సిద్ధించాక ఇప్పటి తరానికి అరుదైన సంపదగా ముద్రించి అందిస్తోంది తెలంగాణ సాహిత్య అకాడమీ. ఇప్పుడు ఖమ్మం పుస్తక మహోత్సవంలో అనేకమంది తెలంగాణ సాహితీ మూర్తులకు అక్షరసేద్యం అందుబాటులోకి ఉంచింది. మన ఖమ్మం జిల్లా కవి కవిరాజమూర్తి ‘మే గరీబ్ హూ’తో పాటు, కథాకళి బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి కథలు, సూరవరం ప్రతాపరెడ్డి కథలు, పీఠికలు, తెలంగాణ పద్య కవితా వైభవం, తెలంగాణ నవలావికాసం వంటి వాటిని అక్కడ అందుబాటులో ఉంచారు. ఖమ్మానికి చెందిన పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు రాసిన తెలుగు నవలా వికాసం, నందగిరి ఇందిరా దేవి కథలు సైతం ఉన్నాయి. ఇప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి తెలంగాణ జిల్లాల చరిత్రతోపాటు శాతవాహనుల నుంచి కాకతీయుల వరకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాషా సాహిత్యం, ఈయని శివనాగిరెడ్డి రాసిన శాతవాహన వారసత్వం, మూడు తరాల తెలుగు కథ లాంటి అరుదైన పుస్తకాలను ముద్రించి అందుబాటులో ఉంచింది తెలంగాణ సాహిత్య అకాడమీ. తెలంగాణ సాహిత్యాన్ని దశ దిశలా వ్యాపింపజేయడానికి ఇతోధికంగా కృషి చేస్తోంది. ఈ తరం పాఠకులు, పుస్తక ప్రియులు, సాహిత్యాభిమానులు, పోటీ పరీక్షార్థులు సందర్శించాల్సిన స్టాల్.. తెలంగాణ సాహిత్య అకాడమీది.