కొత్తగూడెం క్రైం, జనవరి 9 : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది. ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని చాటుకోవడంతోపాటు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ.. అప్పుడప్పుడు అలజడులు సృష్టిస్తూ వస్తున్నారు. అయితే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కోవిడ్ బారినపడి 21, జూన్ 2021లో మృతిచెందిన విషయం విదితమే. దీంతో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆ పార్టీ కట్టుదిట్టమైన వ్యూహాలు రచించింది. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు మావోయిస్టు నేత ఆజాద్ సైతం తనవంతు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. చివరికి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మిలటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను నియమించింది.
ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ఏఓబీ రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్, ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న, కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మా అలియాస్ హిద్మాతోపాటు మరికొందరు కీలక నేతలతో జరిగిన సమావేశంలో బడే చొక్కారావుని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దక్షిణ బస్తర్ కేంద్రంగా ఈ సమీక్ష జరిగినట్లు తెలిసింది. ఈ సమయంలోనే ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ప్రత్యేక భద్రతా దళాలు మావోయిస్టుల సమావేశంపై సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహించి.. వారి జాడ తెలియకపోవడంతో వెనుతిరిగిన విషయం విదితమే. తెలంగాణ రాష్ట్ర మిలటరీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న బడె చొక్కారావుకి మావోయిస్టు పార్టీ ఈ కీలక పదవిని అప్పగించడంతో ఆ పార్టీ వ్యూహాలపై సంకేతాలు అందుతున్నాయి. గతంలో భద్రతా దళాలను టార్గెట్ చేసి వారిపై జరిపిన కాల్పుల ఘటనతోపాటు ల్యాండ్‌మైన్ పేల్చిన ఘటనల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చేందుకు మావోయిస్టు పార్టీ చేస్తున్న వ్యూహాలతో రాష్ట్ర పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వ్యూహరచనలో సిద్ధహస్తుడైన 47 ఏళ్ల చొక్కారావు తెలంగాణ ప్రాంతంలో ఉనికిని ఏ విధంగా చాటుకోనున్నాడో..? మోస్ట్ వాంటెడ్ చొక్కారావు వ్యూహాలకు పోలీస్ శాఖ ఎలా బదులివ్వనున్నదో..? వేచి చూడాల్సిందే.