భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి రెండింటిని మాత్రమే అమలు చేశారు. మరో రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని చెబుతున్నా.. ఆదిలోనే హంసపాదు ఎదురుకావడంతోపాటు ఎన్నో చిక్కులు వచ్చిపడ్డాయి. గ్యాస్ వినియోగదారులు చేసుకున్న దరఖాస్తులను కంప్యూటర్ ఆపరేటర్లు కన్జ్యూమర్ నెంబర్‌ను ఆన్లైన్ చేయడంలో జరిగిన పొరపాటుతో ముప్పు తిప్పలు పడుతున్నారు. గ్యాస్ వినియోగదారుల ఐడీ నెంబర్లు తప్పుగా నమోదు కావడంతో యాప్ కొంత మంది దరఖాస్తులను రిజెక్టు చేసింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా సర్వే బృందాలు మళ్లీ రంగంలోకి దిగాయి. రెండు రోజుల నుంచి పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో ఇంటింటికి తిరుగుతూ గ్యాస్ కనెక్షన్ నెంబర్‌ను యాప్‌లో ఆన్లైన్ చేస్తున్నారు. దీంతో తమకు గ్యాస్ గ్యారెంటీ పథకం వర్తిస్తుందా.. లేదా.. అని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
72,500 ఇళ్లల్లో రీ సర్వే..
కొందరు కంప్యూటర్ ఆపరేటర్ల తప్పిదం వల్ల ప్రజా పాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను రీ సర్వే చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 23,33,235 మంది దరఖాస్తులను కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్లైన్ చేశారు. అందులో ఆరు గ్యారెంటీల అర్హులతోపాటు కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రజలు చేసుకున్న దరఖాస్తులను ఆగమేగాలపై రాత్రికి రాత్రే ఆపరేటర్లతో కంప్యూటర్లలో ఆన్లైన్ చేయించారు. ఈ క్రమంలో కొందరు కార్యదర్శులు కూడా ఆన్లైన్ చేశారు. ఇంత చేసినా గ్యాస్ వినియోగదారుల ఐడీ నెంబర్లు తప్పుగా నమోదు కావడంతో జిల్లాలోని 72,500 మంది దరఖాస్తులను యాప్ రిజెక్టు చేసింది. దీంతో అధికారులు మరోసారి సర్వే చేయించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇందుకోసం గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేక బృందాలను నియమించి అక్కడికక్కడే యాప్‌లో వివరాలను ఆన్లైన్ చేయిన్నారు.
200 యూనిట్ల కరెంటు ఉత్తమాటేనా?
ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఉచిత విద్యుత్‌పై ఇప్పటివరకు పూర్తిస్థాయి సర్వే చేయలేదు. ప్రతి నెల విద్యుత్ బిల్లులు వస్తున్నా.. దానిపై ఆ శాఖ ఎలాంటి చర్యలకు ముందడుగు వేయలేదు. ఒకవేళ సర్వే చేయాలనుకున్నా.. విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఇంటి యజమాని ఆధార్, రేషన్ కార్డు నెంబర్ అడిగి సర్వే చేస్తారు. కానీ.. కార్యరూపం దాల్చలేదు. జిల్లావ్యాప్తంగా గృహ విద్యుత్ వినియోగదారులు 2,82,435 మంది ఉండగా.. ఇందులో 200 యూనిట్ల విద్యుత్ వాడుకునేవారు 2,51,093 మంది ఉన్నారు. అంతకంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించే వారు 31,342 మంది ఉన్నారు. వారి ఆధార్ నెంబర్లు, రేషన్ కార్డు వివరాలు కూడా ఆన్లైన్ చేయాల్సి ఉంది. దీనిపై విద్యుత్ శాఖ ఎస్ఈ రమేశ్‌ను వివరణ కోరగా.. ఇంకా రెండు నెలల సమయం పట్టవచ్చని చెబుతున్నారు.
అప్‌లోడ్‌లో తప్పులు దొర్లాయి
గతంలో ఇచ్చిన దరఖాస్తుల్లో ప్రజలు నెంబర్లు తప్పు వేశారో.. కంప్యూటర్లో ఆన్లైన్ చేసే సమయంలో తప్పుగా పడిందో తెలియదు. దీంతో మళ్లీ సర్వే చేయమన్నారు. గ్యాస్ వినియోగదారులు నెంబర్లు మిస్ మ్యాచ్ అయ్యాయి. అందువల్ల మళ్లీ యాప్‌ను ఇచ్చి ఇంటింటికి వెళ్లి ఆన్లైన్ చేయమని ఆదేశించాం. రెండు రోజుల్లో సర్వే పూర్తవుతుంది.
– మధుసూదనరాజు, అదనపు కలెక్టర్ భద్రాద్రి