రఘునాథపాలెం/ ఖమ్మం, ఆగస్టు 20: ఖమ్మం జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టి సారించింది. యూరియా వినియోగంలో రైతుల అవసరాన్ని ఆసరా చేసుకొని యూరియాతోపాటు ఎరువులు, పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలనే షరతులు విధిస్తున్న ఐదు ఫెర్టిలైజర్ షాపులపై కేసు నమోదు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం సీపీ సునీల్‌దత్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఖమ్మం జిల్లాలోని ఎరువుల షాపులపై బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రఘునాథపాలెం, చింతకాని, నేలకొండపల్లి, సత్తుపల్లి, మండలాల్లోని పలు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు యూరియా కావాలంటే బయోస్టిమ్యులెంట్ ట్యాగ్ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల నివేదిక మేరకు ఆయా షాపుల ట్రేడ్ లైసెన్సు రద్దు చేయాలని ఖమ్మం సీపీ సునీల్‌దత్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు సిఫార్సు చేశారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని అవసరం లేకున్నా యూరియాతోపాటు ఇతర ఎరువులు, పురుగుల మందులు కూడా బలవంతంగా అంటగట్టి రైతులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారని సీపీ పేర్కొన్నారు. ఎరువుల వ్యాపారులు యూరియా కొనుగోలుకు ఏవైనా షరతులు విధిస్తే స్థానిక పోలీసులకుగానీ, వ్యవసాయ శాఖ అధికారులకుగానీ సమాచారం ఇవ్వాలని సీపీ సునీల్‌దత్ రైతులకు సూచించారు.