కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్ 14: మావోయిస్ట్టు ప్రభావిత ప్రాంతాలపై పటిష్ట నిఘా పెడుతున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని రాష్ట్ర సరిహద్దు గ్రామం చెన్నాపురంలో సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్‌తో కలిసి బేస్ క్యాంప్‌ను ప్రారంభించి మాట్లాడారు. మావోయిస్టు పార్టీని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నదన్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని చెన్నాపురం, పూసగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరు వద్ద క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు.
మావోయిస్టుల కదలికలపై పోలీస్ యంత్రాం గం, సీఆర్పీఎఫ్ బలగాల నిఘా ఉంటుందన్నారు. సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్సింగ్ మాట్లాడుతూ.. మావోయిస్టులను కట్టడి చేయడంలో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు పోలీసులు సఫలీకృతం అయ్యారన్నారు. మావోయిస్టుల వ్యూహాలను తిప్పికొడుతున్నారన్నారు. ఇప్పటికే మావోయిస్టులు తమ ఉనికిని పూర్తిగా కోల్పోయారన్నారు. అనంతరం పలు అంశాలపై పోలీస్‌శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డీజీపీ వెంట అదనపు డీజీపీ నళిన్ ప్రభాత్, సౌత్ జోన్ సీఆర్పీఎఫ్ అదనపు డీజీ ఎస్ఎన్ చతుర్వేది, సదరన్ సెక్టార్ సీఆర్పీఎఫ్ ఐజీ మహేశ్‌చంద్ లడ్డా, ఎస్ఐబీ ఐజీ టి.ప్రభాకర్‌రావు, హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఎస్.ఎన్ మిశ్రా, ఛత్తీస్‌గఢ్ కుంట రేంజ్ డీఐజీ రాజీవ్‌కుమార్ ఠాకూర్, భద్రాద్రి ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న, సీఆర్పీఎఫ్ 141వ బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ ధర్, కమాండెట్లు సంజీవ్‌కుమార్, బి.ఆర్.మండల్, ప్రద్యుమణ్ కుమార్‌సింగ్, కొత్తగూడెం ఓఎస్డీ సాయిమనోహర్, భద్రాచలం ఏఎస్పీ బిరుదరాజురోహిత్రాజు, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.