వైరా టౌన్, డిసెంబర్ 1: పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని, క్షేత్రస్థాయిలోనూ దీనిని కచ్చితంగా పాటించాలని వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి సూచించారు. వైరా పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని కేసుల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఫిర్యాదుదారుల పట్ల స్నేహపూర్వకంగా మెలగాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో గతంలో కంటే కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయని అన్నారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సైతం తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే స్పందించి ప్రమాదాలకు గురైన వ్యక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఏసీపీ రెహమాన్, సీఐ సురేశ్, ఎస్సై వీరప్రసాద్ పాల్గొన్నారు.