ఖమ్మం, ఆగస్టు 29 : గణేశ్ నవరాత్రుల ఉత్సవాల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తమండళ్లు ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. నగరంలోని సీక్వెల్ ఫంక్షన్ హాల్లో గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, పీస్ కమిటీలతో వినాయక నవరాత్రి విగ్రహాల ఏర్పాట్లు, బందోబస్తుపై సీపీ గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, డీజేలు పెట్టేందుకు అనుమతి లేదన్నారు. గణేశ్ మండపంలో 24 గంటలపాటు వలంటీర్లు ఉండేలా చూడాలని, భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల నిర్వాహకులు, కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు.
అలాగే భద్రతకు సంబంధించి పోలీసు, నగర పాలక సంస్థ, అగ్నిమాపక శాఖ, నీటిపారుదల శాఖ, వైద్య శాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి సమన్వయంగా పనిచేస్తూ.. నవరాత్రి ఉత్సవాలను సజావుగా జరుపుకునేందుకు కృషి చేస్తున్నామన్నారు.
నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
వినాయక నిమజ్జనోత్సవానికి జిల్లా పరిధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని సీపీ వెల్లడించారు. సెప్టెంబర్ 16న జరిగే గణేశ్ నిమజ్జనం కోసం భారీ పోలీసు బందోబస్తుతోపాటు అత్యవసర పరిస్థితులను ఎదురొనేందుకు గజ ఈతగాళ్లు, క్రేన్లు, లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా చెరువులు, నీటి కుంటల వద్ద వీధి దీపాలు, ఫ్లడ్ లైట్లు, అవసరమున్న మేర క్రేన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేరొన్నారు.
అనంతరం గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు కొన్ని సమస్యలను సీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీపీ వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్‌రావు, ఏసీపీలు రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సాంబరాజు, సీఐలు ఉదయ్‌కుమార్, బాలకృష్ణ, రమేశ్, భానుప్రకాశ్, మోహన్‌బాబు, సతీశ్, కమిటీ సభ్యులు వినోద్ లాహోటి, జైపాల్‌రెడ్డి, సుధాకర్, రామారావు, విద్యాసాగర్, పీస్ కమిటీ సభ్యులు హఫీజ్, జావిద్, అజీజ్, ఆసిఫ్, ఖాసీం, తౌఫిజ్ అహ్మద్, జామల్పాషా పాల్గొన్నారు.