తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారు మెచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. గతంలో కరోనా, గోదావరి వరదలు, సీఎం పర్యటన, రాష్ట్రపతి పర్యటన, వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సమయంలో కలెక్టర్, ఎస్పీలు అమూల్యమైన సేవలందించినందున అదే స్ఫూర్తితో ఇప్పుడూ పనిచేసి ఈ ఉత్సవాలను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో నవమి, పుష్కర పట్టాభిషేకం నిర్వహణ, ఏర్పాట్లపై భద్రాచలం ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా కలెక్టర్ అనుదీప్ ఈ ఉత్సవాల ఏర్పాట్లు, అధికారులకు కేటాయించిన విధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భక్తుల కోసం 24 గంటలూ పనిచేసేలా అత్యవసర వైద్య కేంద్రాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
పారిశుధ్య నిర్వహణను పంచాయతీ కార్యదర్శులతో పర్యవేక్షింపజేయాలని సూచించారు. భక్తులు ఈ ఉత్సవాలను తిలకించేందుకు 36 ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి భక్తుడికీ అందేలా 70 కౌంటర్లు, ప్రసాదాలు అందేలా 19 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఎక్కడి నుంచైనా ఉత్సవాల టిక్కెట్లను, హోటల్ గదులను బుక్‌చేసుకునేలా ఆన్లైన్ సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. మిథిలా ప్రాంగణంలో ప్రతి సెక్టార్‌కూ ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. పోస్టల్, మీ సేవా, ఆర్టీసీ కార్గో, టీ ఫోలియో ద్వారా భక్తుల ఇంటికే తలంబ్రాలు పంపించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి భక్తుడికీ ఉచిత తలంబ్రాలు అందించేందుకు 200 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ నుంచి 400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు వస్తున్నందున మూడు హెలీప్యాడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, ఆర్డీవో రత్నకల్యాణి, దేవస్థానం ఈవో రమాదేవి, ఏఎస్పీ పరితోశ్ పంకజ్ పాల్గొన్నారు.