ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను ప్రాధాన్యతా క్రమంలో భర్తీ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ అభ్యర్థులు రేయింబవళ్లు పోటీపడి చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్కో శాఖలో ఉన్న ఖాళీల వారీగా నోటిఫికేషన్లు ఇస్తూ నియామక పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సర్కారు పూనుకున్నది. దీంతో ‘టెట్’ క్వాలిఫై అయి టీచర్ కొలువు ఎలాగైనా సాధించాలని పోటీపడి చదువుతున్న అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులు 370 భర్తీ కానుండగా.. ఆయా సబ్జెక్టుల అభ్యర్థులు కొలువు తమదే అన్న లక్ష్యంతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
ఖమ్మం, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భద్రాద్రి కొత్తగూడెం (నమస్తే తెలంగాణ): డీఎస్సీ పరీక్ష నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఎంతోకాలంగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాయనున్నారు. 2017లో టీఎస్ పీఎస్సీ ద్వారా సర్కార్ టీఆర్టీ పరీక్ష నిర్వహించింది. ఈసారి మాత్రం డిస్ట్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కొలువులను భర్తీ చేయనున్నది. జిల్లాస్థాయిలో కలెక్టర్ నియామక కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో, డీఈవో, విద్యాశాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు.
అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం..
తెలంగాణ వచ్చినంక రెండోసారి డీఎస్సీ సర్కార్ నుంచి ప్రకటన వెలువడింది. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ 33 జిల్లాల నుంచి ప్రభుత్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలు సేకరించింది. 2017లో డీఎస్సీ స్థానంలో టీఆర్టీ నిర్వహించి ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంతోమంది అభ్యర్థులు పరీక్ష రాసి కొలువులు సంపాదించారు. త్వరలో నిర్వహించే డీఎస్సీకి ఉభయ జిల్లాల నుంచి సుమారు 30 వేల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నట్లు ఓ అంచనా. మరోవైపు టెట్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 15న పరీక్ష జరుగనున్నది. పరీక్షలో అర్హత సాధించిన వారు డీఎస్సీ పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్, డీఎస్సీ రాసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు. బీఎడ్ పూర్తి చేసిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, డీఎడ్ పూర్తి చేసిన వారు ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోనున్నారు.
ఇప్పటికే బదిలీల ప్రక్రియ పూర్తి..
కొన్ని నెలల క్రితం రాష్ట్రవిద్యాశాఖ 317 జీవో ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించింది. దీంతోపాటు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్-2 హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు ప్రక్రియ ప్రారంభించగా కొందరు కోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయింది.
ఉమ్మడి జిల్లాలో ఖాళీగా 370 పోస్టులు..
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 89 స్కూల్ అసిస్టెంట్, 83 ఎస్జీటీ, 10 పీఈటీ, 13 భాషా పండిట్ పోస్టులు.. ఇలా మొత్తం ఖాళీగా ఉన్న 195 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 76 స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ 101, 7 భాషా పండిట్, ఒక పీఈటీ పోస్టులు.. ఇలా మొత్తం 185 పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.
డీఎస్సీ పరీక్ష విధానం ఇలా..
ఎస్స్జీటీ పోస్టులకు : ప్రశ్నాపత్రంలో 80 మార్కులకు 160 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు 1/2 మార్కు. వీటిలో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, విద్యా దృక్పథాలకు 10 మార్కులు, తెలుగుకు 9 మార్కులు, ఆంగ్లానికి 9 మార్కులు, గణితం, సైన్స్, సోషల్ ఒక్కో విభాగంలో 9 మార్కుల చొప్పున 27 మార్కులు, టీచింగ్ మెథడాలజీకి 15 మార్కులు ఉంటాయి.
స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు : ప్రశ్నాపత్రంలో 80 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జీకే, కరెంట్ అఫైర్స్‌కు 20 మార్కులు, విద్యాదృక్పథాలకు 10 మార్కులు, సంబంధిత సబ్జెక్టులకు 44 మార్కులు, మెథడాలజీకి 16 మార్కులు ఉంటాయి.
టెట్ : 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. అర్హత సొందిన మార్కుల్లో ప్రతి ఏడున్నర మార్కులను ఒక మార్క్‌గా పరిగణించి విద్యాశాఖ 20 మార్కులను డీఎస్సీకి కేటాయిస్తుంది.
ఎంతో కాలం నుంచి డీఎస్సీకి సిద్ధమవుతున్నా..
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేయాలనేది నా కోరిక. అందుకే నేను బీఎడ్ పూర్తి చేశాను. ఎంతోకాలం నుంచి డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా. ఇలాంటి సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ రావడం ఉత్సాహాన్నిచ్చింది. నాకు కచ్చితంగా వస్తుందనే నమ్మకం ఉంది.
– కుంజా రమేశ్, డీఎస్సీ అభ్యర్థి, కోయగూడెం, టేకులపల్లి మండలం
తెలంగాణ వచ్చాకే నోటిఫికేషన్లు..
స్వరాష్ట్రం వచ్చాకే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. సర్కార్ కానిస్టేబుల్, ఎస్సై, పంచాయతీ కార్యదర్శితోపాటు ఇంకా ఎన్నో నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన ఎంతో మంది అభ్యర్థులు టెట్, డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. వారందరి కోసం తాజాగా సీఎం కేసీఆర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలాగైనా ఉపాధ్యాయ పోస్టు సాధించాలనే లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నాను.
-బానోత్ సేవియా, డీఎస్సీ అభ్యర్థి, దుబ్బతండా, చండ్రుగొండ మండలం