భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): అంగ రంగ వైభవంగా జరిగే సీతారాముల కల్యాణం ఒక వైపు.. 12 ఏళ్లకోసారి అట్టహాసంగా జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మరోవైపు.. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు.. వారికి అవసరాలకు అనుగుణంగా వసతులు.. ఇన్ని సవాళ్లను ఎదుర్కొని ఉత్సవాలు నిర్వహించడమంటే మాటలు కాదు.. కానీ వాటిని సునాయాసంగా అధిగమించి ఔరా.. అనేలా వేడుకలు నిర్వహించింది జిల్లా యంత్రాంగం. కలెక్టర్ అనుదీప్ మార్గనిర్దేశకత్వంలో ప్రభుత్వ అధికారులు పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం అతిథులను ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కలిసొచ్చిన ముందస్తు సమీక్షలు..
గతేడాది శ్రీరామనమ వేడుకల్లో లోటుపాట్లను పరిగణనలోకి తీసుకున్న మంత్రి అజయ్‌కుమార్, కలెక్టర్ అనుదీప్ ముందుగానే అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు అధికారులు స్వచ్ఛందంగా సలహాలు, సూచనలిచ్చారు. ముందుగానే పార్కింగ్ ప్రదేశాలు, మిథిలా ప్రాంగణంలో షామియానా, చలువ పందిళ్ల ఏర్పాటుపై చర్చించారు. ప్రసాదాలు, తలంబ్రాల పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆలయ పరిధిలో ఏర్పాట్లు, వసతులపై దేవస్థాన అధికారుల అభిప్రాయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేయించారు. వేడుకలకు ఎంతమంది భక్తులు తరలివస్తారు.. ఎన్ని వసతి గదులు అందుబాటులో ఉన్నాయి.. గదులు సరిపోకపోతే మిగిలిన వారికి ఎలాంటి వసతులు కల్పించాలి.. అన్న అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులను ప్రత్యేకంగా పారిశుధ్య పనులకు కేటాయించారు.
వాకీటాకీల ద్వారా సమాచారం..
ఎక్కడ సమస్య తలెత్తినా సత్వరం పరిష్కరించేందుకు ముఖ్యఅధికారులందరూ వాకీటాకీలు వినియోగించారు. సమాచారం ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంకు అందించేలా ఏర్పాట్లు చేశారు. విద్యుత్‌శాఖ అధికారులు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్పీ వినీత్ గంగన్న ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్, ఆర్డీవో రత్నకల్యాణి సమన్వయంతో సిబ్బందిని అప్రమత్తం చేశారు. పారిశుధ్య సిబ్బందితో ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేయించారు.
ప్రతి సెక్టార్లో తాగునీటి వసతి..
వేసవి దృష్ట్యా అధికారులు మిథిలా ప్రాంగణంలోని ప్రతి సెక్టార్లో భక్తులకు తాగునీటి వసతి కల్పించారు. అడిగిన వారికి లేదనుకుండా చక్కటి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కల్యాణ తలంబ్రాలు, ప్రసాదాలకు పట్టణవ్యాప్తంగా విరివిగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
అధికారులకు అభినందనలు..
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాములోరి కల్యాణ మహోత్సవం, పట్టాభిషేకం నిర్వహించిన అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. వేడుకలకు మంచి కవరేజీ ఇచ్చిన మీడియా సంస్థలు, భక్తులకు తాగునీటి వసతి, మజ్జిగ పంపిణీ చేసిన స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు. సీతారాముల కల్యాణంతో పాటు పన్నెండేళ్లకోసారి జరిగే పట్టాభిషేక మహోత్సవాన్ని చూసే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉంది.
-అనుదీప్, భద్రాద్రి కలెక్టర్