టెన్త్ ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే ఉపాధ్యాయులకు పదో తరగతి సబ్జెక్టులు, భాషల బోధనలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. అయితే, ఇటీవల అధిక సంఖ్యలో ఉద్యోగ విరమణలు జరుగుతున్నందున పరీక్షల విభాగం అధికారులు అందుకు అవసరమైన స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యంత క్రియాశీలకమైన స్పాట్ ప్రక్రియకు కొందరు ఉపాధ్యాయులు కనీస సమాచారం ఇవ్వకుండా గైర్హాజరవుతుంటారు. మరికొందరు ఏ విధమైన సర్దుబాట్లూ చేసుకోరు. ఇంకొందరు అనారోగ్య కారణాలు చూపుతూ మూల్యంకన బాధ్యతల నుంచి తప్పించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే స్పాట్ ప్రక్రియ సజావుగా సాగుతుందో లేదోననే అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మూల్యంకనం కోసం తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితంతోపాటు భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్ర్తాల సబ్జెక్టులు, భాషల వారీగా స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లను అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా నియమించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)లను స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. ఈ నెల 1 నాటికి ఎంఈవోలు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా స్పాట్ ఉత్తర్వులను సదరు ఉపాధ్యాయులకు అందజేశారు. మూడేళ్ల అనుభవం నిబంధన రీత్యా.. ఇటీవల పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్లకు, నూతనంగా చేరిన స్కూల్ అసిస్టెంట్లకు ఏఈలుగా అవకాశం కల్పించలేదు. అయితే, ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులు ఈ నెల 4న సంబంధిత పాఠశాలల్లో రిలీవ్ అయి 7న స్పాట్ కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పరీక్షల విభాగం ఏసీ రమేశ్, సీనియర్ అసిస్టెంట్ యూసఫ్ పర్యవేక్షిస్తున్నారు.
స్పాట్ ప్రక్రియలో క్యాంపు ఆఫీసర్గా డీఈవో విధులు నిర్వర్తిస్తారు. అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు(ఏసీవో)గా ఎంఈవోలతోపాటు సీనియర్ ప్రధానోపాధ్యాయులను ఎంపిక చేశారు. చీఫ్ ఎగ్జామినర్లు(సీఈ)గా ప్రధానోపాధ్యాయులు విధులు నిర్వర్తించనున్నారు. ఏఈలుగా స్కూల్ అసిస్టెంట్లను, స్పెషల్ అసిస్టెంట్లుగా ఎస్జీటీలను నియమించారు. మొత్తంగా ఈ మూల్యాంకన ప్రక్రియ కోసం సీఈలుగా 109 మందిని, ఏఈలుగా 648 మందిని, స్పెషల్ అసిస్టెంట్లుగా 218 మందిని నియమించారు. మొత్తం ఈ 975 మందికి విద్యాశాఖ పరీక్షల విభాగం అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు అందజేశారు. స్పాట్లో పాల్గొనే ఉపాధ్యాయులకు రోజుకు 46 సమాధాన పత్రాలను మాత్రమే వాల్యుయేషన్ కోసం ఇవ్వనున్నారు. ఉదయం సమయంలో 20 పేపర్లు, మధ్యాహ్నం సమయంలో 26 పేపర్లు వాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది.
ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో స్పాట్ కేంద్రాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 7 నుంచి 16 వరకు 9 రోజులపాటు మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుంది. స్పాట్ కోసం ఇప్పటివరకు 70 వేల పేపర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు వచ్చిన సమాధాన పత్రాలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరుస్తుంటారు. క్యాంపు ఆఫీసర్ (డీఈవో) పర్యవేక్షణలో పరీక్షల విభాగం అధికారులు, సిబ్బంది ఈ ప్రక్రియను సమన్వయం చేస్తుంటారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
పదో తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో ఉపాధ్యాయుల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు ఈసారైనా తొలగిపోతాయా? లేక ‘యథావిధే’ అన్నట్లుగా ఉంటాయా? అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. టెన్త్ ప్రశ్నపత్రాల వాల్యుయేషన్కు హాజరుకావాలటూ సంబంధిత ఉపాధ్యాయులకు విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు ఇవ్వడం, ఉపాధ్యాయులు హాజరుకాకపోవడం, షోకాజ్ నోటీసులు ఇస్తామంటూ అధికారులు హెచ్చరించడం, రిపోర్ట్ చేయని ఉపాధ్యాయులను రప్పించేందుకు చర్యలు తీసుకోవడం వంటి అంశాలు.. ఖమ్మం జిల్లాలో జరిగే టెన్త్ స్పాట్లో ఏటా కన్పిస్తూనే ఉన్నాయి. మరి ఈ ఏడాది ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు సంబంధిత అధికారులు తమ ప్రణాళికలో భాగంగా ఉత్తర్వులు అందించినప్పటికీ సదరు ఉపాధ్యాయుల్లో ఎంతమంది గైర్హాజరవుతారనే అంశంపై సందిగ్ధం నెలకొంది.
– ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 1