కొత్తగూడెం క్రైం, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆది, సోమవారం జరగనున్న గ్రూప్-3 పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 13,478 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనుండగా.. 39 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రాల వద్ద సుమారు 350 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు, 18వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరగనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఉదయం 9:30 గంటలలోపు కేంద్రాలకు చేరుకోవాలని, మధ్యాహ్నం 2:30 గంటలలోపు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదని తెలిపారు. అలాగే బందోబస్తు విధులకు హాజరుకాబోయే పోలీస్ అధికారులు, సిబ్బందితో కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణలు సమావేశమై వారికి పలు సూచనలు చేశారు.